దళితులకు న్యాయం చేయండిప్రజాశక్తి-శ్రీకాళహస్తి అగ్రకుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ కేవీబీపురం మండలం అంజూరుపాలెం చెందిన దళితులకు సత్వరమే న్యాయం చేయాలని వీసీకే పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జి పులి పుష్పలత డిమాండ్ చేశారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళితులను శుక్రవారం ఆమె పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి 77 ఏళ్ళు గడిచిపోతున్నా కులాంతర వివాహాలు చేసుకునే దళితులపై ఈ తరహా దాడులు జరగడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీ సత్వరమే స్పందించి దళితులపై దాడి చేసిన అగ్రకులస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే వీసీకే పార్టీ ఆధ్వర్యంలో బాధిత దళితుల పక్షాన న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.సమగ్ర దర్యాప్తు చేపట్టాలి : సిపిఎం దళితుల ఇళ్ళు, ఆస్తులు ధ్వంసం చేసి గాయపరిచిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. అంజూరు పాలెం ఘటనపై స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఎం నేతలు శుక్రవారం ధర్నా చేపట్టారు. దళితులపై దాడి చేసి, కులం పేరుతో దూషించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు దాసరి జనార్ధన్ డిమాండ్ చేశారు. ఆస్తుల నష్టంపై పరిహారం అందించాలని కోరారు. దళితులకు రక్షణ కల్పించడంతో పాటు ప్రేమ జంట తులసీ రామ్, లావణ్యలకు భద్రత కల్పించాలని అన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు. సీపీఎం పట్టణ కార్యదర్శి గంధం మణి, పెనగడం గురవయ్య, గెడి వేణు, నాగరాజు, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
