భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు
ప్రజాశక్తి – క్యాంపస్ : సంకీర్తనలను స్వరపరచడాన్ని ఓ వృత్తిగా గాక, జీవితాన్నే సంకీర్తనగా మలచుకుని, శ్రీవారి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకున్న భాగ్యశాలి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సంస్మరణ సభలో ఆయన పాల్గొని నివాళులర్పించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ “సంపదను చాలా మంది రూపాయల్లో కొలిస్తే, బాలకృష్ణ ప్రసాద్ స్వరాల్లో కొలుచుకున్నారు. అన్నమయ్య సంకీర్తనా ప్రాజెక్టు ద్వారా వారి ఆస్థాన గాయకుడిగా నియమితులై, స్వామివారి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకున్నారు” అని చెప్పారు. తెలుగునాట వారి ముఖపరిచయం లేని వ్యక్తులు ఉన్నారేమో గానీ, వారి గాత్ర పరిచయం లేనివారు లేరనటం అతిశయోక్తి కాదన్నారు. తిరుమల శ్రీనివాసుని కృపతో 16 ఏళ్ళ వయసులోనే అన్నమయ్య సంకీర్తనా స్వర యజ్ఞాన్ని బాలకృష్ణ ప్రసాద్ ప్రారంభించారని గుర్తు చేశారు. ఓ ఆధ్యాత్మిక యజ్ఞంలా అన్నమయ్య కీర్తనల స్వర రచనను వారు ముందుకు తీసుకుపోయిన తీరు ఆదర్శనీయమైనది అన్నారు. “గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గళంలో తడిసిన ప్రతి పదమూ, భగవంతుని పాదాలకు స్వర పద్మాలుగా మారుతాయి. ఆ కీర్తనలను విన్న మనసులు ఆధ్యాత్మిక రసానుభూతికి లోనవుతాయి. అంతగా శ్రోతలను ఆకట్టుకున్న భాగ్యశాలి బాలకృష్ణ ప్రసాద్ . అలసట లేని రోజు కోసం వారి కీర్తనలు ఓ సంగీత ఔషధంలా పని చేస్తాయి. సానుకూల ఆలోచనలను పెంపొందింపజేస్తాయి. కీర్తనలను స్వరపరచడమే కాదు, అన్నమయ్య కీర్తనల్లోని సామాజిక బాధ్యతను ఇంటింటికీ చేరువ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అన్ని కీర్తనలు ప్రాణప్రదాలే అని చెబుతూ, సామాజిక బాధ్యతను బోధించే “అంతయు నీవే హరి పుండరీకాక్ష” కీర్తన గురించి వారు ప్రస్తావించారు. ఆ కీర్తన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నదే నా ఆకాంక్ష. కులము, కలిమి, తలపు, నెలవు, తనువు, మనికి, వినికి, పుట్టుగు, ముందు వెనుకలు, నట్టనడుమ, చివరకు కొన ఊపిరి కూడా శ్రీహరే అన్నది ఈ కీర్తనలోని భావం. కుల వివక్షలు లేకుండా, అందరిలో భగవంతుణ్ని చూడగలగడమే నిజమైన భక్తి అన్నది ఈ కీర్తన నుంచి మనం గుర్తెరగాల్సిన సారాంశం. సమాజంలో నేటికీ అక్కడక్కడా కనిపిస్తున్న వివక్షలకు వ్యతిరేకంగా యువతరం ముందుకు సాగాల్సిన కర్తవ్యబోధ ఈ కీర్తన ద్వారా అన్నమయ్య మనకు తెలియజేశారు. బాలకృష్ణ ప్రసాద్ మనసులోని మాట కూడా అదే. అందుకే వారికి ఇష్టమైన కీర్తన అనగానే, సామాజిక వివక్ష లేని సమాజం పట్ల వారి దృక్పథాన్ని తెలిపారు.” అని శ్రీ వెంకయ్య నాయుడు చెప్పారు. బాలకృష్ణ ప్రసాద్ తో వ్యక్తిగతంగా తనకు, తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. యువతరం బాలకృష్ణ ప్రసాద్ గారి జీవితం నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. భగవద్గీతలో చెప్పినట్లు ఫలాపేక్షరహితంగా మన పనులు మనం నిర్వర్తిస్తే… ఫలితం దానంతట అదే వస్తుందన్నారు. తాను సైతం వ్యక్తిగతంగా జీవిత పర్యంతం ఇదే ఆచరణకు కట్టుబడ్డానని చెప్పారు. బాలకృష్ణ ప్రసాద్ కూడా ఇదే మార్గంలో ముందుకు సాగారు.”వారు జీవితంలో ఏదీ కోరుకోలేదు. సంగీతం పట్ల శ్రద్ధ, శ్రీనివాసుని పట్ల భక్తి ప్రపత్తులు, అన్నమయ్య పట్ల అచంచల గౌరవంతో శ్రీనివాసుని సంకీర్తనా యజ్ఞాన్ని జీవిత పర్యంతం కొనసాగించారు. పేరు ప్రతిష్టల గురించి గానీ, ఇతర అంశాల గురించి గానీ ఆలోచించలేదు. తన పనిని తాను పూర్తి చేసుకుంటూ వెళ్ళారు. దీన్ని ఈతరం యువత ప్రేరణగా తీసుకోవాలి” అని సూచించారు.
ఇటీవల సమాజంలో భక్తి పేరిట కొన్ని అనవసర నమ్మకాలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రతి చిన్న విషయానికి తిథులు చూసుకుంటున్నారంటూ మన పెద్దలు సూచించిన మార్గంలో నడవటంలో తప్పు లేదని, అదే సమయంలో మూఢంగా నమ్మకాలు పెంచుకోవడం మంచిది కాదని అన్నారు. “తిథుల కంటే విధులు ముఖ్యం” అన్నారు.