మద్యం షాపులు ‘బంద్’876 మంది ఇంటిబాట కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన తమిళనాడుకు మద్యం ప్రియులు క్యూ ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకురావడంతో జిల్లాలో 876 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఇంటిబాట పట్టారు. తమకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ సంస్థల్లో అవకాశం కల్పించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్టు ఉద్యోగులు షాపులకు బీగాలు వేసి ఆందోళన బాట పట్టారు. మందుబాబులకు ముందస్తు సమాచారం లేకపోవడంతో ‘బార్’ బాట పట్టారు. తిరుపతి జిల్లావ్యాప్తంగా కొన్నిచోట్ల నిరసనలు జరిగాయి. దీంతో ఎక్సైజ్ శాఖ జోక్యం చేసుకుని సాయంత్రం 6 గంటలకు బీగాలను పగలగొట్టి ఎక్సైజ్ పోలీసులే మద్యాన్ని విక్రయించడం గమనార్హం. మరికొన్నిచోట్ల సమీప తమిళనాడు రాష్ట్రానికి స్కూటర్లలో మద్యం ప్రియులు క్యూ కట్టారు. తిరుపతి జిల్లావ్యాప్తంగా 11 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ప్రభుత్వ బ్రాందీషాపులు 218 ఉన్నాయి. సేల్స్ సూపర్‌వైజర్లు, సూపర్‌వైజర్లు, వాచ్‌మెన్లు ఒక్కో షాపులో నలుగురు చొప్పున పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొస్తామని చెబుతూ ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ షాపులకు తెరదీసింది. కలెక్టర్ వెంకటేశ్వర్ నూతన మద్యం పాలసీ విధానాన్ని మీడియాకు వివరించారు. ఐదేళ్లుగా ఇదే జీవనంగా గడుపుతున్న కాంట్రాక్టు ఉద్యోగులు ప్రత్యామ్నాయ ఉద్యోగాలను చూపించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకుండా అక్టోబర్ 12 నుంచి కొత్త పాలసీని అమలు చేయనుంది. దీంతో తమ పరిస్థితి ఏంటంటూ రాష్ట్రవ్యాప్తంగా బ్రాందీషాపుల్లో పనిచేస్తున్న వారు ఆందోళనకు దిగారు. – సూళ్లూరుపేటలోని మద్యం షాపుల్లో పనిచేసిన ఔట్‌సోర్సింగ్ కార్మికులు మంగళవారం నిరసన చేశారు. పెండింగ్ జీతాలు ఇవ్వకపోగా, కనీస ఉద్యోగ భద్రత లేకుండా ఇంటికి పంపడం అన్యాయమని వాపోయారు. నూతన షాపులు వస్తే తమ బతుకులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా మద్యం షాపులు మూతబడడంతో ద్విచక్రవాహనాల్లో సమీప తమిళనాడు వైన్‌షాపులకు స్కూటర్లలో వెళ్లి తెచ్చుకోవడం కనిపించింది. – కోటలో సిబ్బంది నిరసన తెలిపారు. ఐదేళ్లుగా తమకు కనీస వేతనం ఇవ్వకుండా, పిఎఫ్, ఇఎస్‌ఐలతో సహా ఓటులు చేయించుకుని ఏజెన్సీలుత ఇనేశాయన్నారు. దుకాణాలను ప్రైవేట్‌పరం చేసి తమను రోడ్డున పడేస్తోందన్నారుజిల్లావ్యాప్తంగా జాబితా తిరుపతి అర్బన్ మున్సిపల్ కార్పొరేషన్ లో 32, తిరుపతి రూరల్ 12, బి.ఎన్ కండ్రిగ 5, శ్రీకాళహస్తి 12, నాయుడుపేట 13, కేవీబి పురం 3, తొట్టంబేడు 3, ఏర్పేడు 7, నాగలాపురం 4, పిచ్చటూరు 3, సత్యవేడు 10, వరదయ్యపాలెం 5, పుత్తూరు 7, నారాయణవనం 3, రామచంద్రపురం 4, వడమాల పేట 4, చంద్రగిరి మండలం 7, పాకాల మండలం 5, చిన్నగొట్టిగల్లు మండలం 3, ఎర్రావారిపాలెం మండలం 2, గూడూరు 12, చిల్లకూరు 6, ఓజిలి 2, సూళ్లూరుపేట 14, దొరవారి సత్రం 2, పెళ్లకూరు 2, తడ 5, వాకాడు 4, చిట్టమూరు 4, కోట 7, వెంకటగిరి 9, బాలయ్యపల్లి 3, డక్కిలి 3 కలిపి 227 ప్రభుత్వ మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల అయ్యిందన్నారు. పదివేల జనాభా కలిగిన ప్రాంతంలో 50 లక్షల రూపాయలు, 50వేల జనాభా ఉన్న ప్రాంతాలలో 2024-25 గాను 55 లక్షల రూపాయలు, 2025-26 గాను 60 లక్షల 50 వేల రూపాయలు, 50 వేల నుండి 5 లక్షల జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్, మండలాల పరిధిలో 2024-25 గాను 65 లక్షలు, 2025-26 గాను 71 లక్షల 50వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. డిప్ ద్వారా మద్యం షాపు పొందిన వారు ఆరు వాయిదాల పద్ధతులు చెల్లించే వెసులుబాటును నూతన మద్యం పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నాగమల్లేశ్వర రెడ్డి, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాసచారి పాల్గొన్నారు.