ప్రజాశక్తి రామచంద్రాపురం ( చంద్రగిరి) : ఏనుగుల దాడిలో నారావారిపల్లి ఉపసర్పంచ్ మారుపూరి రాకేష్ చౌదరి మరణించారు. పంట పొలాలలో ఏనుగులు సంచరిస్తున్నాయని సమాచారం రావడంతో ఉపసర్పంచ్ వాటిని తరిమేందుకు శనివారం రాత్రి మరొకరితో కలిసి పొలాల వద్దకు చేరుకున్నారు. ఏనుగులు వీరిపై దాడికి దిగడంతో ఒకరు చెట్టు పైకి ఎక్కగా రాకేష్ పరుగులు తీశారు. తెల్ల చొక్కా వేసుకోవడంతో అతనిని వెంబడించి దాడి చేశాయి. ఈ దాడిలో రాకేష్ చౌదరి అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి స్థానికులు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే అధికారులను, కార్యకర్తలను, గ్రామస్తులను, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రాకేష్ మృతదేహాన్ని చంద్రగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం మృతదేహాన్ని మార్చురిలో ఉంచారు. పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు కుటుంబసభ్యులు స్టేషన్‌కు చేరుకున్నారు. వీరివెంట ఎమ్మెల్యే తో పాటు మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.
