Oct 9,2024 00:20
14 నుంచి 'పల్లె పండుగ'

14 నుంచి ‘పల్లె పండుగ’ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ పల్లె పండుగ.. పంచాయతీ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో ఈనెల 14 నుండి 20 వరకు జిల్లాలలో నిర్వహించే పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తిరుపతి జిల్లా నుంచి కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, జాయింట్‌ కలెక్టర్‌ శుభంబన్సల్‌, సంబంధిత శాఖల అధికారులు హాజరైనారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ పల్లెపండుగ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తెలిపారు. గత ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13,325 పంచాయతీల్లో ఒకే రోజున గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేయించిన పనులకు కలెక్టర్లే పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందని, అన్ని పనులు 14 నుంచి వారం రోజుల వ్యవధిలో శంకుస్థాపనలు చేయించి, సంక్రాంతి పండుగ లోగా పనులు అన్ని పూర్తి చేయించాలని కలెక్టర్లును ఆదేశించారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు రూ.2500 కోట్లతో దాదాపు 20వేల పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లెపండగ పంచాయతీ వారోత్సవాలకు పూర్తి సిద్ధంగా ఉన్నామని, భూమిపూజ చేయాల్సిన అన్ని పనులను గుర్తించామని తెలిపారు. ప్రజాప్రతినిధులకు అందరికీ ప్రభుత్వం ద్వారా స్వాగతించి వారి షెడ్యూల్‌ని తీసుకోవడం షెడ్యూల్‌ తయారు చేయడం జరిగిందని తెలిపారు. పంచాయతీలకు సంబంధించిన సమాచార బోర్డులను పెట్టడం జరిగిందని అన్నారు. ప్రతి పంచాయతీలో ప్రభుత్వ భవనాల కాంపౌండ్‌ వాల్స్‌, స్మశాన వాటికలు, నాలెడ్జ్‌ బోర్డ్స్‌, సిసి రోడ్లు, బిటి రోడ్లు గుర్తించిన పనులకు రూ.74కోట్లు మంజూరు చేస్తామని ఇంకా 25 కోట్లు మంజూరు చేయవలసి ఉందని కలెక్టర్‌ ఉప ముఖ్యమంత్రికి తెలిపారు. తిరుపతి జిల్లాలో ఉపాధి హామీ పనులలో భాగంగా వ్యక్తిగత పనులను కల్పించడం జరుగుతుందని, జిల్లాలో ఫారంపాండ్స్‌ పనులు ఇప్పటికే టార్గెట్‌ పూర్తిచేసామని తెలిపారు. ప్రతి పంచాయతీ కవర్‌ చేసుకొనే ఉద్దేశంతో అనిమల్‌ షెల్టర్స్‌ 2,3 మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇసుక, సిమెంట్‌ అందుబాటులో ఉందని తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఓ పెంచల్‌ కిషోర్‌, గూడూరు సబ్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, పంచాయతీ అధికారిణి సుశీల దేవి, డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్‌, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈలు, జడ్పీ డిప్యూటీ సీఈఓ, అధికారులు పాల్గొన్నారు.

➡️