స్తీ స్వీయ చరిత్రలు అవశ్యం’గల్లా’ పుస్తకావిష్కరణ సభలో ఓల్గా ప్రజాశక్తి-తిరుపతి సిటి స్త్రీలు తమ స్వీయ చరిత్రలు రాయడం అవశ్యమని వక్తలు ఉద్ఘాటించారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రచించిన స్వీయచరిత్ర పుస్తకాన్ని ప్రముఖ రచయిత్రి పోపూరి లలితకుమారి (ఓల్గా) ఆవిష్కరించారు. కరకంబాడిలోని అమరరాజా బ్యాటర్సీ ఆడిటోరియంలో ప్రముఖ రచయిత్రి ప్రొఫెసర్ కొలకలూరి మధుజ్యోతి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వెయ్యి పేజీల నిడివిగల పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ముఖ్యఅతిథి ఓల్గా మాట్లాడుతూ తాను ఈ పుస్తకాన్ని రాత్రి 7.30 గంటలకు ప్రారంభించి అర్దరాత్రి 1.30 గంటలకు పూర్తి చేశానని, తనకు ఎక్కడా అలసట, చిరాకు రాలేదని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధిక, రాజకీయ, సామాజిక చరిత్రను తెలియజేసేందుకు ఈ పుస్తకం ఒక ఆధారంగా ఉంటుందన్నారు. ఎక్కువగా స్వీయచరిత్రలు పురుషులే రాస్తారని, మహిళల స్వీయ చరిత్ర చాలా తక్కువన్నారు. ఇప్పటి వరకు 33 మాత్రమే మహిళల స్వీయ చరిత్రలు వచ్చాయన్నారు. మహిళల రాజకీయ గమనం ఎలా ఉంటుంది, అందులో కష్టనష్టాలు, వ్యూహాలు, అధికార రాజకీయాల్లో స్త్రీల దృష్టి భావం అనే అంశాల నుంచి ఈ పుస్తకం వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన గందరగోళాన్ని, కెటిఆర్‌ను పోలీసులు చితకొట్టిన తీరు వీటన్నిటిని నిక్కచ్చిగా ఇందులో పొందిపరిచారని వెల్లడించారు. 1950 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు ఈ పుస్తకంలో స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. సభాధ్యక్షులు కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజల ముందు ఆవిష్కరించేందుకు పూనుకున్న గల్లా అరుణకుమారికి అభినందనలు తెలిపారు. స్త్రీ, స్వీయ చరిత్ర రాయడం అవశ్యం అన్నారు. చక్కని జీవిత సూత్రాలతో గల్లా జీవితాన్ని నడిపారని, వెయ్యి పేజీల పుస్తకంలో ప్రతి పేజీలో ఆమె వెంట నిలిచిన జనం ఆదరాభిమానాలు కనిపిస్తాయన్నారు. మాజీ ఎంపి గల్లా జయదేవ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చే 14 రోజుల ముందు అమ్మ అరుణకుమారి జన్మించిందని, 8 సంవత్సరాల వయస్సులో రాజకీయాల్లోకి ప్రవేశించి, 16 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుని, 17 సంవత్సరాలకే అక్క రమాదేవిని, 19 సంవత్సరాలకే తనకు జన్మనిచ్చిందని, 23 సంవత్సరాల వయస్సులో దేశాన్ని వీడి అమెరికాకు వెళ్లిందని, 35 సంవత్సరాల వయస్సులోనే ప్రపంచ దేశాలు చుట్టి, బారతదేశానికి తిరిగి వచ్చారన్నారు. 42 సంవత్సరాల వయస్సులో ఎంఎల్‌ఏగా గెలిచిందని గుర్తు చేశారు. ఈ పుస్తకంలో అమ్మ పడిన కష్టాన్ని, ఎదుర్కొన్న తీరు స్పష్టంగా వివరించిందన్నారు. త్వరలో నాన్న గల్లా రామచంద్రనాయుడు స్వీయ చరిత్ర పుస్తకం విడుదలవుతుందని తెలిపారు. గల్లా రామచంద్రనాయుడు మాట్లాడుతూ ఆమె జీవిత చరిత్రకు 61 సంవత్సరాలుగా తాను ప్రత్యేక సాక్షినని వెల్లడించారు. తన జీవిత చరిత్రను సులభపద్దతిలో, క్లుప్తంగా రాయడం అబినందనీయమన్నారు. పుస్తక రచయిత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ నేను పెద్దగా చదువుకోలేదని, తనకు కవిత్వం రాయడం రాదని, బాషపై పట్టు కూడా లేదన్నారు. అయినా ఈ పుస్తకం రాయడానకి తన కూతురు ప్రేరేపించిందన్నారు. అమెరికాలో ఉన్నప్పడు తెలుగు వెలుగు, తెలుగు అమెరికా పత్రికలకు వ్యాసాలు రాయమని తనను అడిగితే కొన్ని రాశానన్నారు. దానికి మంచి స్పందన వచ్చిందని, 2014లో తాను ఓడిపోయినప్పడు అమెరికాలో తన కూతురు బలవంతంగా తనను జీవితచరిత్ర రాయమని ఒత్తిడి తెచ్చి, తాను పుస్తకం రచించేందుకు కారకురాలైందని గుర్తు చేశారు. ప్రముఖ వైద్యులు, గల్లా అరుణకుమారి కుమార్తె డాక్టరు గౌరనేని రమాదేవి మాట్లాడుతూ తన చిన్నతనంలో అమ్మ, తాతయ్యతో కలిసి తిరిగానని, వారి నిస్వార్ధ సేవలను దగ్గరిగా చూశానన్నారు. వాటన్నిటిని ఆత్మకథగా రాయాలని అమ్మను ప్రేరిపించి, వాటిని అక్షర రూపంలో రాసేందుకు ప్రోత్సహించానని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈనాడు పత్రిక సంపాదకులు ముక్కా నాగేశ్వరరావు, సాహితీవేత్త ఉమామహేశ్వరరావు, ఎమ్మెస్కో అధినేత చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భూమన్, సాకం నాగరాజు, నామిని సుబ్రమణ్యం, మస్తానమ్మ, కవులు, రచయితలు, సాహితీవేత్తలు, విమర్శకులు, అమరరాజా సిబ్బంది పాల్గొన్నారు.
