సుందర ‘బొమ్మ’లతో ‘స్వచ్ఛ తిరుపతి’ప్రజాశక్తి – తిరుపతి (మంగళం)తిరుపతి సుందర నగరంగా రూపుదిద్దుకుంటోంది.. చిత్రకారుల ‘సిత్రాలు’ గోడలను అందంగా మార్చేస్తున్నాయి. మునుపు విచ్చల విడిగా బహిరంగంగా ఎక్కడ బడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తూ దృశ్యాలు కనిపించేవి. ఈ ప్రక్రియను రూపుమాపడానికి అధికారులు మూత్రశాలలు నిర్మించారు. బహరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తే జరిమానాలు వేయబడతాయని గోడలపై రాతలు రాయించేవారు. అయితే కొందరు ఆకతాయిలు మూత్ర విసర్జన చేయరాదులో ‘దు’ అక్షరాన్ని చేరిపేసిన సందర్భాలు అనేకం. ఈ ప్రయత్నాల్లో ‘మార్పు’ కనిపించలేదని అధికారులు గుర్తించారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో నిర్వహించిన సైన్స్ కాంగ్రెస్ తో నగరంలో నూతన శోభ ఉట్టిపడేలా అక్కడక్కడ మనిషికి అవసరమైన యోగా ఆసనాలు, సుందర దశ్యాలు, గోవింద నామాలు తిరుపతి నగరంలోని గోడలపై అధికారులు రాయించారు. ఇది కాస్త ఫలితాన్ని ఇవ్వడంతో తిరునగరిలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, యూనివర్శిటీ ప్రాంగణ ప్రహరీలు, ప్రసూతి హాస్పిటల్ ప్రహరీ, రూయా ఆసుపత్రి ప్రహరీ, రైల్వేకాలనీ మార్గం ఇలా అనేక చోట్ల శ్రీవారి రూపాలు, కవులు, శ్రీవారి వాహన సేవలకు సంబంధించిన చిత్రాలను తుడా అధికారులు చిత్రకారుల ద్వారా పెయింటింగ్ చేయించారు. దీంతో బహిరంగంగా మూత్ర విసర్జన దాదాపుగా తగ్గింది. మరోవైపు నగరపాలక సంస్థ కూడా స్వచ్చ సర్వేక్షన్ పేరుతో తిరుపతి కోర్టు ప్రాంగణాల వద్ద, ఎస్పీ ఆఫీసు ప్రహరీపై పెయింటింగ్ చేయించారు. నగర వాసులు, యాత్రికులలో మరింత మార్పు రావాలంటే ఇంకా కొన్ని చోట్ల ఇలా దేవతా మూర్తుల చిత్రాలు వేస్తే మంచి ఫలితాలను వస్తుంది అని పలువురు వారి అభిపాయాలను వ్యక్తం చేస్తున్నారు. గోవింద రాజుల స్వామి కోనేరు చుట్టూ వాహనాలు పార్కింగ్ చేయడంతో కోనేరు ప్రహరీపై మూత్ర విసర్జనలు చేస్తూ ఎంతో ఆధ్యాత్మికంగా ఉండాల్సిన ప్రాంగణం దుర్బరస్థితికి చేరింది. సుందర తిరునగరి కావాలంటే గతంలో పబ్లిక్ పాయింట్లలో మూత్ర విసర్జనశాలలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అంతంతమాత్రంగానే అవి కనిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు సమన్వయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అమలు చేయగలిగితే సుందర తిరుపతి సాధ్యమవుతుందని పలువురు సూచిస్తున్నారు.