గూడూరుకు సిలికాన్‌ పరిశ్రమలు తెస్తా.

గూడూరుకు సిలికాన్‌ పరిశ్రమలు తెస్తా.

గూడూరుకు సిలికాన్‌ పరిశ్రమలు తెస్తాప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, గూడూరు టౌన్‌, సత్యవేడు ‘గూడూరు నెల్లూరు జిల్లాలోనే ఉండాలని మీరు అడిగారు.. మీరు కోరుకున్నట్లే తప్పకుండా చేస్తా… గూడూరు పరిసర మండలాల్లో సిలికాన్‌ విస్తారంగా ఉంది.. ఇప్పటి పాలకులు సిలికాన్‌ను ఎలా దోచుకుందామా అని చూస్తున్నారు. నా ఆలోచనైతే సిలికాన్‌ ఆధారిత పరిశ్రమలు తెచ్చి ఇక్కడ యువతకు ఉపాధి చూపాలని అనుకుంటున్నా’ అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల వాగ్దానమిచ్చారు. రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు వస్తాయని, అపుడు దేశంలో ఎంపి, ఎంఎల్‌ఎ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని, అపుడు ఆడబిడ్డలకు రిజర్వేషన్లు అమలవుతాయని, ఇది అమలు చేసే పార్టీ ఎన్డియేనని అన్నారు. కేంద్రంలో ఫైనాన్స్‌ మినిష్టర్‌గా నిర్మలా సీతారామన్‌ ఉన్నారని, ప్రతి ఇంట్లో ఫైనాన్స్‌ మినిష్టర్‌ ఆడబిడ్డలే ఉండాలని, రాష్ట్రంలో పేదరికం లేని సమాజం చూడాలనేది తన కోరికని అన్నారు. గూడూరు పట్టణంలోని సిఆర్‌ రెడ్డి కల్యాణ మండపంలో ‘ప్రజాగళం’లో భాగంగా ఆడబిడ్డలతో ముఖాముఖి నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తిరుపతి పార్లమెంట్‌ బిజెపి అభ్యర్థి వరప్రసాద్‌, గూడూరు టిడిపి అభ్యర్థి సునీల్‌కుమార్‌ల సమక్షంలో 75వ పుట్టినరోజు వేడుకను నారా చంద్రబాబునాయుడు కేక్‌ కట్‌ చేసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా హ్యాపీబర్త్‌డే బాబు అంటూ సభికులు ప్లకార్డులు ప్రదర్శించారు. రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎంపిగా వరప్రసాద్‌ను, ఎంఎల్‌ఎగా సునీల్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. తన పుట్టినరోజు ఆడబిడ్డల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వర్ణముఖిలో ఎక్కడికక్కడ చెక్‌డ్యామ్‌లు కట్టి, భూగర్భజలాలు పెంచి ఇసుక దోపిడీ జరగకుండా చూడాలన్నదే తన కోరికన్నారు. ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా వందల వేల లారీల ఇసుక బకాసురులు ఉన్నారన్నారు. భవిష్యత్‌లో తన కోరిక ఒకటేనని, ప్రపంచంలోనే తెలుగుజాతిని నంబర్‌ 1గా తీర్చిదిద్దుతానన్నారు. జీరో పావర్టీ ఆంధ్రప్రదేశ్‌గా చేయాలనేది తన జీవితాశయమన్నారు. మహిళల్లో బ్రహ్మాండమైన చైతన్యం ఉందని, ఒకప్పుడు ఆడబిడ్డలు ఇంట్లోనుంచి బయటకు వచ్చేవారు కాదని, అదే సమయంలో అన్న నందమూరి తారక రామారావు ఆడబిడ్డలను చదివించాలని మొట్టమొదటిసారిగా నిర్ణయించారన్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించి, ఆస్తిలో సమాన హక్కు కల్పించారన్నారు. ఆడవాళ్లు చదువుకోవడం వల్ల రివర్స్‌ కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. ‘మహాశక్తి’ తిరుగులేని శక్తివంతులుగా చేసే బాధ్యతను టిడిపి తీసుకుంటుందన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎంఎల్‌ఎ అభ్యర్థి నెలవల విజయశ్రీ, పార్టీ నాయకులు పనబాక క్రిష్ణయ్య, కురుగొండ్ల రామక్రిష్ణ, వాకాటి నారాయణరెడ్డి, పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి, తీగల చంద్రశేఖర్‌, వాటంబేడు శివకుమార్‌, సంధ్యారాణి, గంగాప్రసాద్‌, నెలవలసుబ్రమణ్యం, పరసారత్నం పాల్గొన్నారు. సాయంత్రం సత్యవేడు బహిరంగసభలో పాల్గొని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ప్రతి ఇంట్లో సంపద సృష్టిస్తా నీళ్లొస్తే సంపద పెరుగుతుందనడానికి శ్రీసిటీనే నిదర్శనం.. నా వల్ల ప్రతి ఇంట్లోనూ సంపద సృష్టి జరుగుతుంది. జగన్‌రెడ్డి తన ఇంట్లో సంపద సృష్టించుకున్నాడు. ఓటు వేసే ముందు బిడ్డల భవిష్యత్‌ తలచుకుని ఓటేయాలని నారా చంద్రబాబునాయుడు అన్నారు. సత్యవేడు ప్రజాగళం సభ టవర్‌క్లాక్‌ వద్ద జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సమరానికి సత్యవేడు తొడ కొడుతోందన్నారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని, ప్రత్యేకంగా దళితుల్లో తిరుగుబాటు చూసి జగన్‌రెడ్డి వెన్నులో వణుకు మొదలయ్యిందన్నారు. ప్రశ్నిస్తే ఎంఎల్‌ఎగా పనికిరావని నెట్టేశారని, అలాంటి అరాచక శక్తులను ఎదురొడ్డిన నాయకుడు కోనేటి ఆదిమూలమని అన్నారు. తెలుగుదేశంలోనే జడ్‌పిటిసిగా, ఫ్లోర్‌లీడర్‌గా, జిల్లా పార్టీలో పనిచేశారన్నారు. పెత్తందారీ వ్యవస్థపై తిరుగుబాటు చేసి టిడిపిలో చేరారన్నారు. ఐఎఎస్‌ అధికారిగాపనిచేసిన వ్యక్తి అవమానాలు భరించలేక బిజెపిలో చేరారన్నారు. ఎన్‌డిఎ ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేస్తున్న వీరిని గెలిపించాలన్నారు. ఇసుక, గ్రావెల్‌ మట్టిని 200 టిప్పర్లు పెట్టి చెన్నరులో అమ్ముకుంటున్నాడని, ఆకాశమే హద్దుగా ఇక్కడ ఓ పుడింగి దోచుకుంటున్నాడన్నారు. అటవీ భూముల్లో యూకలిప్టస్‌ చెట్లు పెంచితే, అక్కడ కూడా కమీషన్లు కొట్టేస్తున్నారన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు డాన్‌గా చిత్తూరు జిల్లాను మార్చారన్నారు. దళితుని చంపి డోర్‌ డెలివరీ చేసిన వానికి ఎంఎల్‌సిగా కొనసాగిస్తున్నావని, దళితునికి శిరోముండనం కేసులో జైలుశిక్ష పడిన వాడికి ఎంఎల్‌ఎ సీటిచ్చావని ఎద్దేవా చేశారు. వైసిపిని భూస్థాపితం చేసిన రోజే భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో 22 కేసులున్న వ్యక్తి ఇక్కడ వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా ఉన్నారన్నారు. సత్యవేడు, వరదయ్యపాలెంలను నగర పంచాయతీలుగా చేసి ఆధునిక నగరాలుగా తయారు చేస్తానన్నారు. శ్రీసిటీలో 200 పరిశ్రమలున్నాయని, వాటిని పెంచడం పెద్ద కష్టం కాదని, తెలుగుగంగ కాల్వను వెడల్పుచేస్తే కావలసినంత నీరు నిల్వ చేసుకోవచ్చన్నారు. కుప్పంలో భువనేశ్వరి సమక్షంలో జన్మదిన వేడుకలు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు 74వ జన్మదిన వేడుకలు కుప్పం పిఇఎస్‌ మెడికల్‌ కాలేజీలో నారా భువనేశ్వరి బస కేంద్రంలో ఘనంగా జరిగాయి. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవినాయుడు, భువనేశ్వరి టీమ్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి కంచర్ల శ్రీకాంత్‌, డాక్టర్‌ సురేష్‌ పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి రూరల్‌ రఘునాథ్‌ రిసార్ట్స్‌లోనూ, రామచంద్రాపురం మండల కేంద్రంలోనూ, చంద్రగిరి ప్రధాన కూడలిలోనూ, అనుపల్లిలోనూ అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈశ్వర్‌రెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, మధునాయుడు, సల్మాన్‌రాజు పాల్గొన్నారు. దొరవారిసత్రంలో మండల అధ్యక్షులు వేమసాని శ్రీనివాసనాయుడు కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌చేశారు.

➡️