‘ఇండియా’తోనే ప్రత్యేక హోదా సాధ్యం జగన్‌, చంద్రబాబు ఇద్దరూ మోదీకి బానిసలు 2.30లక్షల ఉద్యోగాల పైనే మొదటి సంతకంఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

'ఇండియా'తోనే ప్రత్యేక హోదా సాధ్యం జగన్‌, చంద్రబాబు ఇద్దరూ మోదీకి బానిసలు 2.30లక్షల ఉద్యోగాల పైనే మొదటి సంతకంఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

‘ఇండియా’తోనే ప్రత్యేక హోదా సాధ్యం జగన్‌, చంద్రబాబు ఇద్దరూ మోదీకి బానిసలు 2.30లక్షల ఉద్యోగాల పైనే మొదటి సంతకంఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలప్రజాశక్తి-శ్రీకాళహస్తి ”వైసీపీ అధినేత జగన్‌.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ నరేంద్ర మోదీకి బానిసలు… చంద్రబాబు కానీ… జగన్మోహన్‌ రెడ్డి కానీ ఏ నాడూ ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదు. నరేంద్ర మోదీ, జగన్‌, చంద్రబాబు కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాలేదు. ‘ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం. ఇది కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హమీ. ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య తీర్చడానికి 2.30లక్షల ఉద్యోగాల భర్తీ ఫైల్‌పై మొదటి సంతకం పెడతాం’ అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చెప్పారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ… ఏపీ విభజన తరువాత 2014 నుంచి ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు… 2019 నుంచి ఐదేళ్ల పాటు జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్రమోదీ మాట తప్పారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఏపీలో అభివద్ధి పనులు మొత్తం ఆగి పోయాయని షర్మిల ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు, దుగ్గిరాజుపట్నం ఓడరేవు, విశాఖ రైల్వే జోన్‌, కడప స్టీల్‌ ప్లాంటు, మన్నవరం విద్యుత్‌ ఉపకరణాల తయారీ ప్రాజెక్టు, ఏపీ రాజధాని… అన్ని పనులు ఆపేశారన్నారు. ఏపీకి రాజధాని లేకపోవడం చాలా బాధాకరమన్నారు. చంద్రబాబు, జగన్మోహన్‌ రెడ్డి తమ స్వప్రయోజనాల కోసం ఏపీని నరేంద్ర మోదీకి తాకట్టు పెట్టారన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇపుడు ఇస్తున్న ప్రతి హామీని నెరవేర్చుతామని వైఎస్‌ షర్మిల చెప్పారు. జగన్‌ తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని విస్మరించారన్నారు. పాఠశాల విద్య అభ్యసించే ప్రతి ఒక్కరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పిన జగన్‌… ఆ తరువాత మాట తప్పారన్నారు. ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇపుడు అమ్మఒడి ఇస్తున్నారన్నారు. అది కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకుండా కోత విధిస్తున్నారన్నారు. కుంభకర్ణుడు ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే నిద్రపోతారని… అయితే నాలుగన్నరేళ్లు నిద్రపోయిన జగన్‌… ఎన్నికల వేళ నిద్ర లేచారన్నారు. చంద్రబాబు హయాంలో 23వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని… అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని జగన్‌ తన పాదయాత్ర సందర్బంగా నిరుద్యోగులకు హామీ ఇచ్చారన్నారు. అయితే నాలుగన్నరేళ్లు నిద్రలో ఉన్న జగన్‌… ఎన్నికల వేళ 6వేల పోస్టులతో దగా డీఎస్సీ నిర్వహించడానికి నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. ఎవరైనా ఎన్నికలకు రెండు నెలల మునుపు డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇస్తారా అని షర్మిల ప్రశ్నించారు. నిరుద్యోగులను దగా చేయడానికే జగన్‌ ఈ నాటకం ఆడారన్నారు. గతంలో ప్రభుత్వ చౌక దుకాణాల్లో 11రకాల సరుకులు రేషన్‌ కార్డుదారులకు అందించే వారన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక కేవలం బియ్యం, చక్కెర మాత్రమే పంపిణీ చేస్తున్నారన్నారు. ఇలా నిత్యావసర సరుకుల్లో కోత విధించడం వలన పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ పాలనలో ఏడు పర్యాయాలు విద్యుత్‌ ఛార్జీలు, రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారన్నారు. ప్రస్తుతం సామాన్యులు విద్యుత్‌ ఛార్జీల భారం మోయలేకున్నారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచడంతో సామాన్యుల బతుకు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. జగన్‌ పేదలకు సంక్షేమ పథకాలు ఒక చేత్తో ఇచ్చి… రెండు చేతుల్తో వారిని దోచుకు తింటున్నారని ఆమె ఆరోపించారు. ఇక ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకు ఏడాది రూ.లక్ష వంతున ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఏపీలో ఖాళీగా 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. వద్ధులు, వితంతువులకు నెలకు రూ.4వేలు వంతున… ప్రత్యేక ప్రతిభావంతులకు రూ.6వేలు వంతున సామాజిక భద్రత ఫింఛను అందచేస్తామన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం రూ.5లక్షలు ఆర్ధికసాయం చేస్తామన్నారు. ఇల్లు లేని ప్రతి పేదకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇక ఓటు తల్లి, చెల్లిలాంటిదని… ప్రతి ఓటరు ఆలోచించి మంచి చేసే వారికి ఓటు వేయాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ పోతుగుంట రాజేష్‌ నాయుడు, తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ చింతామోహన్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సభలో కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ పోతుగుంట రాజేష్‌ నాయుడు, సీపీఎం నేతలు అంగేరి పుల్లయ్య, గంధం మణి, సీపీఐ నేతలు జనమాల గురవయ్య, వైఎస్‌ మణి తదితరులు పాల్గొన్నారు. పిచ్చాటూరు, సత్యవేడు: సత్యవేడులోని పోలీసుస్టేషన్‌ సమీపంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల న్యాయయాత్ర సభ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పరిశ్రమలు తీసుకొస్తుందని పేర్కొన్నారు. టిడిపి, వైసిపి పార్టీలు ప్రత్యేక హోదాను తీసుకురాకుండా బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివద్ధి దిశగా తీసుకుపోవాలంటే ఒక కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమన్నారు. స్థానిక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలాగురు బాబుని నియోజకవర్గంలోని ప్రజలు ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎం పార్టీ నియోజకవర్గ కార్యదర్శి దాసరి జనార్ధన్‌, కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పుత్తూరుటౌన్‌: అధికారంలో వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని హామీ ఇచ్చిన జగన్‌ రెడ్డి దాని గూర్చి పట్టించుకోలేదని, రాష్ట్రంలో ఎక్కడ అభివద్ధి చేయలేదని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యాయయాత్రలో భాగంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల రెడ్డి పుత్తూరులోని కాపీవీధి జంక్షన్‌లో ఆదివారం పర్యటించారు. నగిరి నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పోచారం రాకేష్‌రెడ్డిని ఆశ్వీరదించి ఆదరించాలని ప్రజలను కోరారు. మంత్రిగా రోజా ఉన్న నగరి నియోజకవర్గంలో ఎలాంటి అభివద్ధి జరగలేదని, ఎమ్మెల్యే హోదాతో భూకబ్జాలు, గ్రామాల నుంచి మట్టి తరలించి అమ్ముకున్నారే తప్ప పేదప్రజలకు అభివద్ధి చేయడంలో శూన్యం ఆరోపించారు. మిత్రపక్షాల బిజెపి జనసేన టిడిపి వైసిపి పొత్తుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని, అలా జరగకుండా ఉండాలంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే దీనిని అరికట్టేందుకు వీలవుతుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, నగరి నియోజకవర్గ అధ్యక్షులు ఆర్‌.వెంకటేష్‌, సిపిఐ రాష్ట్ర నాయకులు రామానాయుడు, మహేష్‌ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశభక్తులకు దేశద్రోహులకు మధ్య జరుగుతున్నదని, మద్దతుల్లో మహన్మాది శక్తులను ఓడించాలని ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. ఇండియా కూటమి అభ్యర్థులు రాకేష్‌రెడ్డి పోటీ చేస్తున్నారని ఆయన్ను గెలిపించాలన్నారు.

➡️