తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రారంభం

తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రారంభం

తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రారంభంప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికలు సందర్భంగా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర వారం రోజులు వాయిదాతో జరుగుతుంది. ఈనెల ఏడో తేదీ చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభం కావల్సి ఉండగా ఎన్నికల వల్ల జాతరకు బందోబస్తు కల్పించలేమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తిరుపతి అర్బన్‌ ఎస్పి చెప్పడంతో వారం రోజులు ఆలస్యంగా జాతర మొదలైంది. ఎంతో వైభవంగా జరిగే తాతయ్యగుంట గంగమ్మ జాతరకు చాటింపు 14వ తేదీ మంగళవారం జరిగింది. ఏపీలో జరిగే జాతరలో గంగమ్మ జాతర ఒకటి. ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తిరుపతి గ్రామదేవత తాతాయ్యగుంట గంగమ్మకు ప్రతిఏటా జాతర చేయడం ఆనవాయితీగా వస్తోంది. జాతరలో భాగంగా గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం అర్థరాత్రి చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభంకానుంది. కైకాల వంశస్తులు తిరుపతి గంగజాతర సందర్భంగా మంగళవారం గ్రామంలో చాటింపు వేస్తారు. అనంతరం భేరి వీధిలో తొలి చాటింపు పూజ నిర్వహించి నగర శివారు ప్రాంతాలలో అష్టదిగ్బంధనం చేసి చాటింపుతో జాతరకు శ్రీకారం చుట్టనున్నారు. బుధవారం బైరాగి వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. నేటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు జాతర జరుగనుంది. 22వ తేదీన తెల్లవారు జామున అమ్మవారి విశ్వరూప దర్శనం, చెంప నరికే కార్యక్రమంతో జాతర ముగియనుంది. ఈ ఏడు రోజుల పాటు వివిధ వేషాలలో గంగమ్మను భక్తులు దర్శించుకోనున్నారు. అలాగే ఈ జాతరలో మరో విశేషం ఉంది.. జాతర జరిగినన్ని రోజులు గ్రామస్తులు ఊరి విడిచి వెళ్లరాదు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా రాత్రుళ్లు బస చేయకుండా వెళ్లిపోవడం అక్కడి ఆచారం.చాటింపుతో జాతర ప్రారంభం.. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో జాతర మొదలవుతుంది. బుధవారం బైరాగి వేషం గురువారం బండవేశం, శుక్రవారం తోటి వేషం, శనివారం దొరవేశం, ఆదివారం మాతంగి వేషం, సోమవారం సున్నపు కుండలు, మంగళవారం గంగమ్మ జాతర, బుధవారం విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది.గంగమ్మను దర్శించుకున్న పలువురు నేతలు.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పాల్గొంటే ఎన్నికలు ముగియడంతో మంగళవారం తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు, తిరుపతి టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టిడిపి కార్పొరేటర్‌ అన్నా యాదవ్‌తో పాటు పలువురు టిడిపి జనసేన నాయకులు దర్శించుకున్నారు. జాతర సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

➡️