చంద్రగిరిలో గంజాయి ఆనవాలు రూపుమాపండి – టిడిపి నాయకులు

చంద్రగిరిలో గంజాయి ఆనవాలు రూపుమాపండి - టిడిపి నాయకులు

చంద్రగిరిలో గంజాయి ఆనవాలు రూపుమాపండి – టిడిపి నాయకులు ప్రజాశక్తి రామచంద్రపురం ( చంద్రగిరి) చంద్రగిరిలో యువత భవితను నాశనం చేస్తున్న గంజాయిని ఆనవాలు లేకుండా ఉక్కుపాదం మోపి రూపుమాపాలని తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు గౌస్ బాషా, రాష్ట్ర రైతు కార్యదర్శి ఈశ్వరవాక శివ కోటీశ్వర రెడ్డి, మానికొండ కన్నయ్య నాయుడు మంగళవారం సిఐ సుబ్బరామిరెడ్డి ని కలిసి నినదించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మధ్యం ధరలు విపరీతంగా పెంచడంతో పేద కూలీలు, మధ్యం ప్రియులు కొనలేక గంజాయి కి అలవాటు పడినట్లు తెలిపారు. మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు మండలంలో శాఖలు ఏర్పాటు చేసి గంజాయిని విచ్చలవిడిగా విక్రయించటంతో యువత వాటికి అలవాటు పడి బానిసై అనేక దురాగతాలకు పాల్పడినట్లు వారు ఆరోపించారు. గంజాయినే ప్రదాన ఆదాయవనరులుగా భావించి వైకాపా నాయకులు విచ్చలవిడిగా దోచుకున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా తమ నాయకుడు పులి వర్తి నాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామన్న హామీలో భాగంగా దానికే ప్రాధాన్యత ఇస్తున్నారని గంజాయిని ఏ పార్టీ వారు విక్రయిస్తున్నా సహరిస్తున్నా సరఫరా చేస్తున్నా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో వాహన సంఖ్యలు పెరిగి రాకపోకలకు ఇబ్బందిగా మారటంతో రహదారిలో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా తిరుపతి తరహాలో రోజుకు ఒక పక్క వాహనాలను నిలిపి క్రమబద్ధీకరణ చేసి ఇబ్బందులు తొలగించాలని కోరారు. ఆదివారం వారపు సంత రోజున టవర్ క్లాక్ సర్కిల్లో బస్సుల రాకపోకలకు ఇబ్బంది కరం లేకుండా సిబ్బందిని నియమించి సహకరించాలన్నారు. సీనియర్ నాయకులు పాలడుగు మురళి నాయుడు, గిరి పాల్గొన్నారు.

➡️