ప్రజాశక్తి-రామచంద్రపురం : మండలంలోని రాయల చెరువు పేట పచ్చికాపలం ప్రధాన రహదారిలో సికె పల్లి క్రాస్ రోడ్డు వద్ద స్కూటర్ లో అదుపుతప్పి కింద పడి హిందీ ఉపాధ్యాయుడు ఎస్. శివ కేశవులు (44) శనివారం రాత్రి 10 గంటలకు అక్కడికక్కడే మృతి చెందారు. ఎన్ ఆర్ కమ్మపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసే ఎస్ శివ కేశవులు పుత్తూరులో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి స్వగ్రామమైన చట్టతూరు గ్రామానికి AP 03 R 7423 నెంబర్ గల హీరో హోండా స్పెండర్ ద్విచక్ర వాహనంలో వస్తుండగా మొదట మలుపు వద్ద అదుపు తప్పే కింద పడ్డాడు. మరలా లేచి ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేసుకుని కొంత దూరం వెళ్లిన తర్వాత మరల అదుపుతప్పి తారురోడ్డుపై పడడంతో తలకు ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు గ్రహించి, హాస్పిటల్కు తరలించేందుకు 108కి ఫోన్ చేశారు. 108 సిబ్బంది వచ్చి వైద్య పరీక్షలు చేయగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతునికి భార్య, కుమార్తె కలరు. గ్రామస్తులు మృతుల కుటుంబ సభ్యులు మృతి చెందిన విషయం తెలుసుకొని మృతదేహం వద్ద బోరుమని వినిపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారాన్ని ఆర్ సి పురం పోలీసులకు అందజేయడంతో ట్రైనీ ఐపీఎస్ బొడ్డు హేమంత్, ఇన్చార్జి సీఐ చిన్న గోవిందుడు, ఇన్చార్జి ఎస్ఐ రవీంద్ర నాయక్ లు పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించారు.
