మరణించిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
వారి కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్
ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో తొక్కిసలాట ఘటన అత్యంత దురదృష్టకరం. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. టికెట్ల జారీ కోసం చేసిన ఏర్పాట్లలో సరైన పణాళిక లేదని అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనపడుతుందని అన్నారు. ఇలాంటి పర్వదినాల్లో శ్రీవారి దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని, నిష్ణాతులైన అధికారులని నియమించకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపులతోనే కాలం గడుపుతున్నారని విమర్శించారు. గత అయిదు సంవత్సరాల్లో ఎలాంటి చిన్న ఘటన కూడా జరగకుండా బాధ్యతాయుతంగా పని చేసిన అధికారుల మీద కక్ష సాధింపు చర్యలకి పాల్పడటమే చూస్తున్నాము గాని వారిని సమన్వయపరచి వారితో పనిచేయించే దిశగా పనిచేయలేదని అన్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రతిష్టలు వన్నె తగ్గకుండా చేయాల్సిన బాధ్యత ఉన్న అధికారులు కేవలం లడ్డు వివాదం లాంటి డైవర్షన్ పాలిటిక్స్, రాజకీయ వేధింపులకు, రాజకీయ కుట్రలకు మాత్రమే కేంద్రంగా చేసుకోవడం అత్యంత బాధాకరం. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనకు బాద్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ డిమాండ్ చేసారు. తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్థిక సాయం అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేసారు.