రాష్ట్ర హక్కులపై మాట్లాడేవారేరి..?

May 28,2024 22:03
రాష్ట్ర హక్కులపై మాట్లాడేవారేరి..?

జూన్‌లో పింఛన్ల పడిగాపులు లేకుండా చూడాలిసిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుప్రజాశక్తి-తిరుపతి సిటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు రాష్ట్రాల హక్కుల కోసం లౌకికవాదాన్ని దృష్టిలో ఉంచుకుని టిడిపిని స్థాపించారని, అయితే ప్రస్తుతం రాష్ట్రాల హక్కుల కోసం టిడిపిలోనూ, వైసిపిలోనూ మాట్లాడేవారే లేరన్నారు. ఎన్టీఆర్‌కు పూలమాలలు వేస్తున్న నాయకులు, ఆయన ఆశయాలను తుంగలో తొక్కారన్నారు. దారితప్పిన టిడిపిని ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులే తిరిగి గాడిలో పెట్టాలన్నారు. ఎన్టీఆర్‌, నెహ్రూ, కందుకూరిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.తిరుపతి సిపిఎం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత 15 రోజులుగా ప్రధాని మోడీ ఉపన్యాసాలు వింటే దేశభవిష్యత్‌ ఏమవుతుందోనని భయం వేస్తుందన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెబుతున్న మోడి, దేశంలో వెనుకబాటు, పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు ఏర్పాటు చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ముస్లీంలకు సైతం వెనుకుబాటుతనంతో రిజర్వేషన్లు ఇచ్చారని, మత రిజర్వేషన్లు రద్దు చేస్తే హిందువులకూ రిజర్వేషన్లు ఉండవన్నారు. ఈ విషయం బిజెపి కార్యకర్తలకూ తెలుసన్నారు. జూన్‌ నెలలో పింఛన్ల కోసం పడిగాపులు పడేలా చేస్తే క్షమించరాని తప్పిదం అవుతుందని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పనులు జరిగే చోట హృదయ విదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కూలీలు ఎండతీవ్రత తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారని, చంటిపిల్లలను సైతం ఎండల్లోనే ఉంచి పనులు చేసుకోవడం బాధాకరమన్నారు. రోజంతా కష్టపడినా కూలీలకు రూ.200 కూలి దక్కడం లేదన్నారు. ఉపాధి కూలీలకు కనీస కూలి రూ.400, వైద్య సౌకర్యాలు, పనిచేసే చోట కనీస వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసకు టిడిపి, వైసిపి రెండు పార్టీలు ప్రధాన కారణమన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమయ్యిందన్నారు. మోడీ చెప్పినట్లు ఈసీ ఆడుతుందన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచకుండా, ప్రజా మద్దతు కోరిన ఏకైక పార్టీ సిపిఎం అని స్పష్టం చేశారు. రాబోవు రోజుల్లో ఎవ్వరూ అధికారంలో ఉన్న బెయిల్‌పై ఉన్న ముఖ్యమంత్రులేనని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య పాల్గొన్నారు.

➡️