తిరుపతి జిల్లా ఎస్పీ, డిఎస్పి బదిలీ

తిరుపతి జిల్లా ఎస్పీ, డిఎస్పి బదిలీ ప్రజాశక్తి -తిరుపతి సిటీ ఎన్నికల అనంతరం జిల్లాలో చోటు చేసుకున్న ఘర్షణలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించారని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్‌ పటేల్‌, డీఎస్పీ సురేంద్ర రెడ్డి లను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 13వ తేదీ పోలింగ్‌ ముగిసిన రోజు రాత్రి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మోహిత్‌రెడ్డి పై, ఆ పార్టీ నాయకులపై జరిగిన దాడులు, కార్లు దగ్ధం, 14వ తేదీ శ్రీ పద్మావతి మహిళ యూనివర్సిటీలో టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై జరిగిన దాడి ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయ్యింది. దీంతోపాటు రాష్ట్రంలో జరిగిన పలు ఘటనలపై సిఎస్‌, డిజిపి లను వివరణ కోరడంతో వారు గురువారం హుటా హుటిన ఢిల్లీకి చేరుకొని, ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. రాష్ట్ర ఉన్నతాధికారుల వివరణ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎస్పీలు, కలెక్టర్‌, డీఎస్పీ లపై చర్యలు చేపట్టారు. అందులో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌, వెస్ట్‌ డిఎస్పి సురేంద్రారెడ్డి లను బదిలీ చేస్తూ, పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌ లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. గత రెండు రోజులుగా జరిగిన ఘటనలపై వీరి తీరును ఆక్షేపిస్తూ, శాఖపరమైన విచారణకు ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో వీరి స్థానాలలో కొత్త అధికారులను నియమించనున్నట్లు సమాచారం.

➡️