విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపైపవన్‌, చంద్రబాబు స్పందించాలి కార్మికసంఘాల డిమాండ్‌

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపైపవన్‌, చంద్రబాబు స్పందించాలి కార్మికసంఘాల డిమాండ్‌

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపైపవన్‌, చంద్రబాబు స్పందించాలి కార్మికసంఘాల డిమాండ్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా తిరుపతి సబ్‌కలెక్టరేట్‌ వద్ద సిఐటియు, ఎఐటియుసి, భవన నిర్మాణ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.సుబ్రమణ్యం, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, రాధాక్రిష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సూపర్‌ సిక్స్‌ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పండుగలు జరుపుకున్నారని, ప్రధాన సమస్యలపై స్పందించడం లేదన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌, సిఎం చంద్రబాబు స్పందించాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 4,200 మంది కాంట్రాక్టు కార్మికుల గేట్‌ పాసులను తిరిగి తీసుకున్నారని, రెగ్యులర్‌ ఉద్యోగులు 2,500 మందికి విఆర్‌ఎస్‌ వచ్చి బలవంతంగా ఇళ్లకు పంపించారన్నారు. 500 మంది రెగ్యులర్‌ ఉద్యోగులను డిప్యుటేషన్‌పై ఇతర సంస్థలకు బదిలీ చేయాలని చూస్తున్నా, భూములను కారుచౌకగా అమ్మేస్తున్నా, ఉక్కు సామర్థ్యం 75 లక్షల టన్నుల నుంచి 40 టక్షల టన్నులకు తగ్గించినా పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రంలో నరేంద్రమోడీకి భయపడి ప్రశ్నించే ధైర్యం లేక చేతులు ముడుచుకుని కూర్చున్నారన్నారు. ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్‌ చేశారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదన్నారు. తిరుపతిని మద్యరహితంగా ప్రకటించాల్సింది పోయి, అదనంగా షాపులు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డి రవి, వేణుగోపాల్‌, విశ్వనాధం, శ్రీరాములు, కెవై రాజా, బుజ్జి, ఎన్‌డి శ్రీను, భాస్కర్‌, ఉమాపతి పాల్గొన్నారు. వెంకటగిరి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు, ఎఐటియుసి నాయకులు వడ్డిపల్లి చెంగయ్య, జాన్‌, బాలకృష్ణయ్య మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిధులు కేటాయించకుండా నష్టాల్లో ఉందని కుంటిసాకులు చూపుతూ ప్రైవేటీకరించడం దుర్మార్గమన్నారు. నాయకులు మంజుల, శివకుమార్‌, ప్రసాద్‌, సుబ్రమణ్యం, శేఖర్‌, బాలాజీ, నరేష్‌ పాల్గొన్నారు. గూడూరు టవర్‌క్లాక్‌ సెంటర్‌లో నిరసన జరిగింది. సిపిఎం నాయకులు జోగి శివకుమార్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కి బంగారు గుడ్డు పెట్టే బాతులాంటి గని విశాఖ ఉక్కును పోస్కో కంపెనీకి కట్టబెట్టాలని బిజెపి ప్రభుత్వం చూస్తోందన్నారు. బివి రమణయ్య, పుట్టా శంకరయ్య, అడపాల ప్రసాద్‌, ఎస్‌.సురేష్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️