ఆధ్యాత్మిక పార్కు పునరుద్ధరణకు కసరత్తుఈసారి బోర్డులో చర్చించనున్న టిటిడి?ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో పూతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అవిలాల చెరువును ఆథ్యాత్మిక థీమ్ పార్కుగా తీర్చిదిద్దాలని గతంలో టిటిడి నిర్ణయించింది. అప్పటి ఈవో సాంబశివరావు ఆధ్వర్యంలో 80 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి యుద్ధప్రాతిపదికన 125 ఎకరాల చెరువు మరమ్మతును చేపట్టారు. ఇందులో చెరువుకు చుట్టుపక్కల వెదురు బొంగులతో ప్రహరీ ఏర్పాటు చేసి నాలుగు ముఖద్వారాల్లో ఆర్చిలను నిర్మించి ఆథ్యాత్మిక పార్కుగా అభివృద్ధి చేయాలని తలిచారు. గతంలో అప్పటి ప్రతిపక్షమైన వైసిపి చెరువులో ఎలా నిర్మాణాలు చేపడతారని సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. దీంతో కొంత ఆటంకం కలిగినప్పటికీ అన్యాక్రాంతం కాకుండా టిటిడి చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కోర్టుకు వివరించడంతో సుప్రీం సైతం టిటిడి పక్షానే తీర్పునిచ్చింది. అయితే వైసిపి అధికారంలో ఉన్నపుడు ఆ ప్రాజెక్టుకు మంగళం పాడింది. దీంతో ముళ్లకంచెలు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ప్రస్తుతం టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఆ పార్కు అన్యాక్రాంతం కాకుండా ఆధ్యాత్మిక థీమ్ పార్కు పునర్నిర్మాణం చేపట్టాలని టిటిడి తలుస్తోంది. టిటిడి నూతన బోర్డులో రెండో సమావేశంలో థీమ్‌పార్కు అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో గదులు, దర్శనాలు కల్పించలేకపోవడంతో ఒకరోజైనా భక్తులు తిరుపతి, రూరల్ పరిధిలో ఆధ్యాత్మికత కేంద్రాలను అభివృద్ధి చేయడం ద్వారా రద్దీని కొంతమేర తగ్గించే అవకాశం ఉందన్నది టిటిడి యోచన. ఈ నేపథ్యంలోనే అవిలాల చెరువు వద్ద అభివృద్ధి చేయనున్న థీమ్ పార్కులో వాకింగ్ ట్రాక్, సైక్లింగ్, బోటింగ్, లేజర్ లైటింగ్‌తో పాటు రకరకాల పూల మొక్కలతో ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికతతో కూడిన గోవింద నామ స్మరణ వినిపించనుంది. వచ్చే బోర్డులో ఈ విషయమై నిర్ణయించి, నిధులు కేటాయించే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.