మానసిక వికలాంగ కేంద్రంలో..డయేరియాతో ఇద్దరు మృతి

మానసిక వికలాంగ కేంద్రంలో..డయేరియాతో ఇద్దరు మృతి

మానసిక వికలాంగ కేంద్రంలో..డయేరియాతో ఇద్దరు మృతిప్రజాశక్తి – తిరుపతి సిటి తిరుపతి రూరల్‌ పద్మావతిపురంలోని ‘పాస్‌’ మానసిక వికలాంగుల కేంద్రంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. ఆశ్రయం పొందుతున్న మానసిక వికలాంగుల్లో ఇద్దరు అనాధలు గణపతి (35), శేషాచలం (16) అతిసారతో మృతిచెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు 9 మంది రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పాస్‌ మానసిక వికలాంగ కేంద్రాన్ని, రుయాలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వీరిలో ఇద్దరిని మెరుగైన చికిత్స నిమిత్తం కలెక్టర్‌ స్విమ్స్‌కు రిఫర్‌ చేశారు. ఘటనకు కారణాలను వైద్యాధికారులను, నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. నీటిని, ఆహారాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. డయేరియా బాధితులను పరామర్శించిన కలెక్టర్‌రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌ వైద్య అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న (పాస్‌ మనో వికాస్‌) మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాల డయేరియా బాదితులు ఉండే వార్డులను సందర్శించి వైద్య సిబ్బందికి సూచిస్తూ బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ… రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మంది డయేరియా బాధితులలో ఇద్దరు మరణించారని, మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, వారికి స్పెషలిస్ట్‌ డాక్టర్ల ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అందులో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం స్థానిక స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాల ఎన్‌జిఓ ఆధ్వర్యంలో నడుస్తోందన్నారు. ఈ ఆశ్రమంలో సుమారు 6 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వయసు గల 72 మంది ఆశ్రయం పొందుతున్నారు. జూలై 6వ తేదీన మధ్యాహ్నం అల్పాహారం తీసుకున్న తర్వాత ఆదివారం ఉదయం నుండి కొంతమందికి వాంతులు, విరోచనాలు అయిన వారికి మెట్రోజెల్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు వారికి అందించడం జరిగిందని, అయినప్పటికీ వారికి డయేరియా కంట్రోల్‌ కాకపోవడం వలన వారికి మెరుగైన చికిత్స కోసం సోమవారం ఉదయం వారిని సదరు ఎన్జీఓ రుయా ఆసుపత్రికి తీసుకొచ్చారన్నారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా డయేరియా నియంత్రణకు చర్యలు చేపడుతోందన్నారు. ఆశ్రమంలో ఉన్న మిగిలిన పిల్లలు డయేరియా బారిన పడకుండా వారికి ప్రత్యేక మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేశామని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకునే విధంగా అన్నిరకాల చర్యలు జిల్లా యంత్రాంగం చేపడుతోందని తెలిపారు. అనంతరం స్థానిక పద్మావతి పురంలోని (పాస్‌ మనో వికాస్‌) మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్‌ తనిఖీ చేసారు. మానసిక దివ్యాంగుల ఆదర్శ ప్రత్యేక పాఠశాలలో డయేరియా ప్రబలడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో తాగునీరు, వంటగదిని, పరిసరాలను పరిశీలించారు. ఆశ్రమంలో ఎప్పటికప్పుడు బ్లీచింగ్‌ తో శుభ్రపరిచి స్వచ్చమైన నీరు, పరిశుభ్రమైన ఆహారం వారికి అందించాలని ఆశ్రమ సిబ్బందికి తెలిపారు. ఆశ్రమంలోని ఇతర పిల్లలకు డయేరియా బారిన పడకుండా వైద్య సిబ్బంది ప్రత్యేక మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యులు అందుబాటులో ఉండేలా ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డిఓ రిశాంత్‌ రెడ్డి, డిఎంహెచ్‌ఓ శ్రీహరి, రుయా సూపెరింటెండెంట్‌ రవి ప్రభు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్దుల శాఖ అధికారి శ్రీనివాస్‌, ఆశ్రమ పాఠశాల జనరల్‌ సెక్రెటరీ బాలకష్ణమూర్తి, ప్రిన్సిపాల్‌ మురళీకష్ణ పాల్గొన్నారు.

➡️