విద్యుత్ భారాలపై చిత్తశుద్ధితో వ్యవహరించాలి

Mar 18,2025 17:26 #Kadapa

ప్రజాశక్తి – కడప : విద్యుత్ భారాలపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి అన్నారు. మంగళవారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.  ఏ.పీ. ట్రాన్స్ కోకు  2014-19 కాలానికి సంబంధించి రూ.1050 కోట్లకు పైగా మిగులు వచ్చింది. ఆ మేరకు ట్రూ డౌన్ ద్వారా వినియోగదారులకు చార్జీలు తగ్గించబోతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు తగ్గించకపోగా రూ.15,485 కోట్లు అదనంగా సర్దుబాటు చార్జీల భారాన్ని ప్రజలపై వేసిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి. విద్యుత్ భారం తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నారు.

కేంద్రం ప్రజలను దోచుకుంటుంది

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయ జ్యోతి విమర్శించారు.  ముడి చమురు  ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దాని ప్రయోజనాలు ప్రజలకు  చేరవేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంకా ఈ దోపిడీ ఎంత కాలం కొనసాగుతుంది అని విజయ జ్యోతి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో అమల్లోకి తీసుకురానున్న లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాట్లాడుతూ కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందన్నారు. దేశ వనరులు, పాలనలో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం ఉండాలని స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయడం వల్ల దక్షిణాదిలో ఎమ్మెల్యే సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలో సమన్యాయం లేకుండా పోతుంది. అందువల్ల అలాంటివి జరగకుండా సామాజిక సమానత్వం కోసం అందరు కలిసికట్టుగా పోరాడాలని విజయ జ్యోతి పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షుడు అఫ్జల్ఖాన్, కడప అసెంబ్లీ సమన్వయకర్త బండి జకరయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి అలీఖాన్, చిన్నకుళ్లాయప్ప, అశోక్రెడ్డి, రహమతుల్లాఖాన్, సయ్యద్ గౌస్ పీర్, రఫీక్ ఖాన్, సిరాజుద్దీన్, పీడీ సంజయ్కాంత, గౌరీదేవి, షేక్ నీలం పాల్గొన్నారు.

➡️