రెవెన్యూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ప్రజాశక్తి – కడప రెవెన్యూ అధికారులు అన్నిరకాల జిఒలు, చట్టాలపై అవగాహన పెంచుకుని తమ పనితీరు మెరుగుపరచుకొని బాధ్యతాయుతంగా, జవాబుదారి తనంతో పనిచేయాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని సభా భవన్‌లో కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని తహశీల్దార్లు, టిడిలు, విఆర్‌ఒ, మండల సర్వేయర్లతో వివిధ రకాల రెవెన్యూ అంశాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవిన్యూ సేవలలో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యమన్నారు. పనితీరులో ప్రమాణాలు పెంచుకోవాలన్నారు. ప్రజలతో కలిసి మెలిసి మమేకం కావాలని, చట్ట ప్రకారం మార్గదర్శకాలు మేరకు పని చేయాలని సూచించారు. వ్యవస్థలో లోపాలు సరిదిద్దుకొని ముందుకు వెళ్లగలిగినప్పుడే శాఖకు మంచి పేరు వస్తుందన్నారు. ఏలాంటి సమస్య అయినా కాలాతీతం చేయకుండా వేగంగా స్పందించి చట్టప్రకారం చర్యలు చేపట్టి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. పిజిఆర్‌ఎస్‌ ద్వారా అందిన దరఖాస్తులను ఆయా గ్రామాల వారిగా క్రోడీకరించుకోవాలని సూచించారు. ప్రతి వారం పిజిఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారంపై ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్ష చేస్తోందన్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను నాణ్యతగా పరిష్కరించడమే మన బాధ్యత అని తెలియజేశారు. సమస్యలపైన అవగాహన పెంపొందించడానికి తహశీల్దార్లు ప్రతి రోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని, ఆ గ్రామంలోని సమస్యలపై దష్టిసారించి పరిష్కార మార్గాలను వెదుకుతూ విజయవంతంగా మండల స్థాయిలో రెవెన్యూ సేవల పనితీరును మెరుగు పరచడం జరుగుతోందన్నారు. వేగంగా స్పందించి క్షేత్రస్థాయిలో వాస్తవాలను విచారణ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకొని అర్జీలను నాణ్యతగా సమస్యను పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చేయడం, నిర్లక్ష్యం వహిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. భూముల అంశంలో నిబంధనలను దష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ చేసి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. గ్రామ స్థాయిలో గుర్తించిన అర్జీలను పరిష్కరించడానికి నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు వారంలో నాలుగు రోజులు విజిట్‌ చేసి పూర్తి అవగాహనతో పరిష్కరించాలన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ ఎంక్వయిరీలు నిర్వహించేటప్పుడు సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో కలసి పనిచేయాలన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమించుకునే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ అధికారులు అసైన్డ్‌ భూములు, ఆర్‌ఒఆర్‌, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, చట్టాలు తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి పని చేయాలన్నారు. 1142 జిఒ ప్రకారం ఎలాంటి భూములను ఎవరికి అసైన్‌ చేయాలనే అంశానికి సంబంధించి విధివిధానాలపై, రీ సర్వే, వెబ్‌ లాండింగ్‌, మ్యుటేషన్స్‌ మొదలైన అంశాల్లో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులకు ఎదురయ్యే సమస్యలు, అనుభవాలపై సమీక్ష నిర్వహించి, ఆయా రెవెన్యూ డివిజన్‌ అధికారులకు, తహశీల్దార్లకు పునశ్చరణ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, డిఆర్‌ఒ విశ్వేశ్వర నాయుడు, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్‌డిఒలు జాన్‌ ఇర్విన్‌, సాయిశ్రీ, చంద్రమోహన్‌, చిన్నయ్య, ల్యాండ్స్‌ సర్వే ఎడి మురళీకష్ణ, నాలుగు రెవెన్యూ డివిజన్ల తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు, విఆర్‌ఒలు, తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️