ప్రజాశక్తి-కొండపి: మండలంలోని పెట్లూరు పంచాయతీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఏసురత్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆరెతోటి బాబూరావు తెలిపారు. శనివారం నాడు ఆరెతోటి బాబురావు తన స్వంత నిధులతో ఏర్పాటు చేసిన పెట్లూరు గ్రామంలోని అంబేద్కర్ కాలనీ ఆర్చీని, పెట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆర్చీని సర్పంచ్ ఆరెతోటి ఝాన్సీరాణి చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామంలో కాలనీ వాసులు ఆర్చీ అడగగా వెంటనే బాబూరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలనీ పేరుతో ఆర్చీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెట్లూరులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రోడ్డు వెంబడి ఆర్చి ఏర్పాటు చేయాలని ఆరోగ్య సిబ్బంది అడగగా వెంటనే అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెండు ఆర్చీలకు సుమారు రూ.2 లక్షలు బాబూరావు తన స్వంత నిధులతో ఏర్పాటు చేయడం పట్ల కాలనీవాసులు, వైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బాబూరావు పుట్టిన రోజు సందర్భంగా కాలనీవాసులు, యువత కేక్ కట్ చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ అనూష, వైద్య సిబ్బంది, గ్రామ నాయకులు కందిమళ్ల లక్ష్మినారాయణ, మూలె కోటేశ్వరరావు, కోయవారిపాలెం రవి, కృష్ణ, చవటపాలెం ఆంజనేయులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
