ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువులనే వినియోగించాలి

Mar 15,2025 20:27

పజల ఆరోగ్యం కాపాడేందుకే ప్లాస్టిక్‌ పై నిషేధం

స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్‌ బాబు

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ :  రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే ప్రభుత్వం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని నిషేధించిందని రాష్ట్ర సహకార, వాణిజ్యపన్నుల కమిషనర్‌, జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్‌ అహ్మద్‌ బాబు అన్నారు. ప్లాస్టిక్‌ వస్తువులకు ప్రత్యామ్నాయ వస్తువులు అందుబాటులో వున్నందున ప్రజలు వాటిని వినియోగించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నారు. మూడో శనివారం సందర్భంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బి.ఆర్‌.అంబేద్కర్‌(బాలాజీ) జంక్షన్‌ వద్ద నిర్వహించిన స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన అనంతరం తొలిసారిగా సందర్శించిన బాబుకు జిల్లా కలెక్టర్‌ డా.బి.ఆర్‌.అంబేద్కర్‌, ఆర్‌డిఒ కీర్తి, మునిసిపల్‌ కమిషనర్‌ నల్లనయ్య, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ నాగార్జున తదితరులు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ కు ప్రత్యామ్నాయంగా వినియోగించే క్లాత్‌, జ్యూట్‌ బాగులు, ఇతర ఉత్పత్తుల ప్రదర్శనను ప్రత్యేక అధికారి, కలెక్టర్‌ తిలకించారు. ఒకసారి వినియోగించిన ప్లాస్టిక్‌ వస్తువులతో గృహాలంకరణ సామాగ్రిగా రూపొందించి ఏర్పాటు చేసిన మరో ప్రదర్శనను ప్రమీల అనే శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఏర్పాటు చేయగా ప్రత్యేక అధికారి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా విజయనగరాన్ని ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దుతామంటూ అక్కడకు హాజరైన మహిళలతో, జిల్లా కలెక్టర్‌, కమిషనర్‌, జిల్లా అదికారులతో ప్రతిజ్ఞ చేయించారు. పలువురు స్వయంశక్తి మహిళలకు క్లాత్‌, జ్యూట్‌తో తయారుచేసిన బ్యాగులను అందజేసి వాటినే భవిష్యత్తులో వినియోగించాలని కోరారు. ఆర్‌డిఒ కీర్తి, సెట్విజ్‌ సిఇఒ ఎ.సోమేశ్వరరావు, జిఎస్‌టి జాయింట్‌ కమిషనర్‌ నాగరాజు, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ కొండపల్లి సాంబమూర్తి, ఎసిపి రమణమూర్తి, 43వ వార్డు కార్పొరేటర్‌ దాసరి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గంటస్థంభం నుంచి డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ కూడలి వరకు స్వచ్ఛాంధ్రపై స్వయంశక్తి మహిళలతో ర్యాలీ నిర్వహించారు.

➡️