ప్రజాశక్తి – పార్వతీపురం : జిల్లాలో సంక్రాంతి సంబరాలను ఈనెల 11, 12 తేదీల్లో పార్వతీపురంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సంక్రాంతి సంబరాలు నిర్వహణ పట్ల శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముగ్గులు, ఆటలు, గాలి పటాలు, సాంస్కృతిక కార్యక్రమాలుసంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గులు, ఆటలు, గాలి పటాలు, సాంస్కతిక కార్యక్రమాలు శని, ఆదివారాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ చెప్పారు. శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు ప్రారంభమవుతాయని, 11 గంటలకు గాలిపటాల పోటీలు, మధ్యాహ్నం 4 గంటల నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విద్యార్థులు, స్థానిక కళాకారులతో జానపద, శాస్త్రీయ నృత్యాలు, వివిధ శాఖల ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. ఈనెల 12న ఆదివారం వివిధ శాఖల ప్రదర్శనలు, ఛాయా చిత్ర ప్రదర్శన, చిన్నారుల క్రీడలు, ఆహార ప్రదర్శన శాలలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాలు పోస్టర్ ను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై.సత్యం నాయుడు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.రామచంద్రరావు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి టి.కనకదుర్గ, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.డి.గయాజుద్దీన్, విద్యా శాఖ ఎడి ఎంఇ రమా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.