నేడు నగర పంచాయతీ చైర్మన్‌ ఎన్నిక

Feb 2,2025 20:54

ప్రజాశక్తి – పాలకొండ : మొదటి నుంచి నగర పంచాయతీ చైర్మన్‌ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠం నెలకొంటుంది. 20 వార్డు సభ్యులకు గానూ 17 మంది వైసిపికి ఉండగా ముగ్గురు టిడిపి చెందినవారు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు నాలుగో వార్డు కౌన్సిలర్‌ గంగ నాయుడు జనసేన కండువా పుచ్చుకున్నారు. అయితే ఇటీవల కాలంలో 19వ వార్డు కౌన్సిలర్‌ రాధా కుమారి వ్యక్తిగత కారణాలతో చైర్మన్‌ పదవికి రాజీనామా చేయడంతో వైసిపికి చెందిన వైస్‌ చైర్మన్‌-2 పల్లా ప్రతాప్‌కు ఆ పదవి వరించింది. అయితే చైర్మన్‌ ఎస్సీకి రిజర్వ్‌ చేయడంతో రెండో వార్డు వైసిపికి చెందిన కౌన్సిలర్‌ ఆకులు మల్లేశ్వరికి ఈ పదవి వరిస్తుందని అంతా భావించారు. సోమవారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పురపాలక సంఘాలు, నగర పంచాయతీలో చైర్మన్లు, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరపాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే నాలుగు రోజుల క్రితం రెండో వార్డ్‌ కౌన్సిలర్‌ ఆకుల మల్లేశ్వరి, ఆమె భర్త కుమార్‌ ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో పసుపు కొండువా కప్పుకున్నారు. దీంతో రాజకీయాలు రసవంతంగా మారాయి. ఇన్‌ఛార్జి మంత్రికి కూటమి ఎమ్మెల్యే జయకృష్ణతో విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఇక్కడున్న టిడిపి కౌన్సిలర్లు కూడా మల్లేశ్వరికి మద్దతు తీస్తారా లేదా చూడాల్సి ఉంది. వైసిపి అధినాయకత్వం విప్‌ జారీ చేయడంతో ఆకుల కుమారి నామినేషన్‌ దాఖల చేయడానికి కూడా వీల్లేదని వైసిపి వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉండగా 19వ వార్డులో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన స్వర్ణకుమారి కోర్టులో పిల్‌ కూడా వేయడం జరిగింది. 19వ వార్డులో కౌన్సిలర్‌ ఎన్నిక జరగకుండా చైర్మన్‌ ఎన్నిక జరపొద్దని కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. అయితే చైర్మన్‌గా ఆకులు మల్లేశ్వరి అవుతారా లేదా వైస్‌ చైర్మన్‌ 2 ప్రతాప్‌ చైర్మన్‌గా కొనసాగుతారా అన్నది చూడాల్సి ఉంది. పట్టణం లో దీనిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

➡️