పర్యాటక ప్రాజెక్టులను పూర్తి చేయాలి

ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో చేపడుతున్న పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిని పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో కలెక్టర్‌ అధ్య క్షతన జిల్లా పర్యాటక కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు, వాటికి సంబంధించిన రహదారుల నిర్మాణం, పర్యాటక ప్రాజెక్టులకు భూమి కేటాయింపు, ఒక జిల్లా ఒక పర్యాటక ప్రాజెక్టు కింద జిల్లాలో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టులు, హార్స్‌లీహిల్స్‌లో చేపట్టబోయే టెంట్‌ సిటీ ప్రాజెక్టు, అన్నమాచార్యుల వారి గురించి, అన్నమాచార్య కీర్తనలను ప్రచారం చేయడం తదితర అంశాలపై కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలకు రహదారుల నిర్మాణం త్వరగా పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. గిరిజన కార్పొరేషన్‌ వారు అరకు కాఫీ కోసం అడిగిన స్థలాన్ని కేటాయించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రాజెక్ట్‌ కింద అన్నమయ్య జిల్లాలో చేపట్టనున్న ప్రాజెక్టులకు సంబంధించిన నివేదికలను వెంటనే సమర్పించాలని జిల్లా పర్యాటకశాఖ అధికారిని ఆదేశించారు. అన్నమాచార్యులు వారి కీర్తనలను ప్రచారం చేసేందుకు టిటిడి వారితో సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవాలని జిల్లా పర్యాటకశాఖ అధికారిని ఆదేశించారు. హార్స్‌లీ హిల్స్‌లో నిర్మించబోతున్న టెంట్‌సిటీపై పూర్తిస్థాయి నివేదికను వెంటనే సమర్పించాలని జిల్లా పర్యాటకశాఖ అధికారిని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, జిల్లా డిఎఫ్‌ఒ, పర్యాటకశాఖ రీజనల్‌ డైరెక్టర్‌ రమణ ప్రసాద్‌, రాయచోటి, మదనపల్లె, బి.కొత్తకోట మున్సిపల్‌ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు

➡️