విజిలెన్స్ తనిఖీలతో వెలుగు చూస్తున్న ట్రేడ్ లైసెన్స్ ఫీజుల అవినీతి బాగోతం

Dec 28,2024 16:05 #antapuram

ప్రజాశక్తి – అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో శుక్రవారం విజిలెన్స్ శాఖ అధికారుల ముమ్మర తనిఖీలతో ప్రజారోగ్య సిబ్బంది అవినీతి చేతివాటం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కళ్యాణ్ దుర్గం రోడ్డు బైపాస్ వద్ద ఉన్న వైభవ్ రెసిడెన్సి కి 2011లో అప్పటి శానిటరీ ఇన్ స్పక్టర్ గంగిరెడ్డి, ప్రస్తుత ఎమ్మిగనూరు కమిషనర్ ఫీజు వసూలుకు సంబంధించి చేతి రసీదు రాసి ఇచ్చారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకు మాత్రం సదరు సొమ్ము జమ కాకపోగా అప్పటినుంచి ఇప్పటివరకు ప్రజారోగ్య సిబ్బంది ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలుకు సంబంధించి నోటీసులు జారీ చేయకపోగా చెల్లించిన సొమ్ముకు సైతం ఆన్లైన్లో నమోదు కాకపోవటం విశేషం. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో వైభవ్ రెసిడెన్సి దాని యజమాని ఎస్ఆర్ నాగభూషణం సానిటరీ ఇన్స్పెక్టర్ గంగిరెడ్డి చేతిరాత రసీదు తాము కట్టిన ఫీజుల దస్త్రాలు తీసుకువచ్చి హెల్త్ ఆఫీసర్ విష్ణుమూర్తికి, కమిషనర్ రామలింగేశ్వర కు చూపించి తాము ఫీజులు కట్టిన 2011 నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజులు బకాయిలు ఉన్నట్టు మున్సిపల్ కార్పొరేషన్ రికార్డులు చూపటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సాక్షాత్తు రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కమిషనర్ రామలింగేశ్వర కు ఫోన్ చేసి ఈ అంశంపై వాకబు చేయటంతో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజారోగ్య అధికారులకు అప్పటికప్పుడు  పుట్టుకొచ్చిన రసీదులను  వైభవ రెసిడెన్సి యాజమాన్యం చూపింది. అయితే రికార్డులలో  రసీదుల్లో జమ అయినట్టుగా ఉండి, డబ్బలు పరంగా జమకానట్టు ఉండడం ఏమిటని అరియర్స్ రూపంలో బకాయిలు చెల్లించాలని అధికారులు ఆ రెసిడెన్సీ యాజమాన్యనికి తెలిపింది. ఈ రసీదులపై సరైన వివరణ ఇవ్వకపోతే   తాము కోర్టుకు సైతం వెళ్తామని అధికారులు హెచ్చరించారు.  ఈ తనిఖీల్లో  చనిపోయిన సానిటరీ ఇన్స్పెక్టర్ సురేంద్ర సైతం ఫీజు వసూళ్లకు సంబంధించి చేతి రసీదు కాగితాలు వెలుగు చూశాయి. సంబంధిత ఫీజులు మాత్రం కార్పొరేషన్ ఖజానాకు జమ కాలేదని ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాసుల కక్కుర్తి తో ప్రజారోగ్య సిబ్బంది వ్యవహరించటం మున్సిపల్ కార్పొరేషన్ పరువు ప్రతిష్టలు బజారున పడ్డాయి. అలాగే గడచిన ఐదేళ్ల కాలంలో సచివాలయ సిబ్బంది ఆయా వార్డుల పరిధిలో వసూలు చేసిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సైతం అధిక శాతం ఖజానా ఖాతాకు జమ కాక కాకపోవటం వెలుగు చూస్తోందని, దీనికి అప్పటి ప్రజారోగ్య రెగ్యులర్ హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు  పేర్కొన్నారు. తాము వసూలు చేసిన ఫీజులు మొత్తాలను జాబితాలో వారీగా తయారుచేసి ప్రజారోగ్య విభాగానికి అందజేశామని అయితే ఆన్లైన్లో మాత్రం వాటిని జమ చేయకుండా పెండింగ్ అరియర్స్ కింద చూపటంతో వారు దిక్కుతోచనే స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 2019 నుంచి 2024 – 25 ఆర్థిక సంవత్సరం వరకు 50 శాతం ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లు జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 – 25 కు గాను ఇప్పటివరకు కేవలం 26 శాతం ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లు మాత్రమే జరిగాయని అధికార గణాంకాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఇంత జరిగిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులు క్రమం తప్పకుండా చెల్లించామని పేర్కొంటున్న వ్యాపార వర్గాలకు ప్రజారోగ్య విభాగం అడ్డగోలుగా సమాధానాలు ఇస్తుండటం పై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ప్రజారోగ్య అధికారులు తమ తప్పులను అంగీకరించే స్థితిలో లేకపోగా వ్యాపార వర్గాలపై ట్రేడ్ లైసెన్స్ ఫీజుల అరియర్స్ బకాయిలపై దిగుతుండటం వ్యాపార వర్గాలను  ఆందోళనకు గురి చేస్తున్నాయి. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నోటీసులు జారీ చేస్తే గాని ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కట్టటం గగనమవుతుందని, అలాంటిది నోటీసులు జారీ చేయటంలో నిర్లక్ష్యం చూపటమే గాక సానిటరీ ఇన్స్పెక్టర్లు మేస్త్రీలు సచివాలయం సిబ్బందిలో కొందరు ఫీజుల స్వాహా చేసిన క్రమంలో పలువురు సస్పెన్షన్లకు సైతం గతంలో గురయ్యారు. అయినా వారి తీరులో మార్పు రాకపోవటం శోచనీయం. స్వాహా చేసిన మొత్తాలను కొందరు మాత్రమే గతంలో కార్పొరేషన్ ఖజానాకు కఠినంగా వ్యవహరించే కమిషనర్ల చర్యల కారణంగా జమ చేయడం జరిగింది. ఆ దిశగా చర్యలు చేపట్టని కమిషనర్ల ఉదాసీన వైఖరి ప్రేక్షక పాత్ర కారణంగా సైతం ట్రేడ్ లైసెన్స్ ఫీజుల బకాయిలు 3.94 కోట్లకు చేరటం జరిగిందని ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్ల అవినీతి భాగోతంలో చేతి రసీదులు ఇచ్చి జేబులో నింపుకున్న ప్రజారోగ్య సిబ్బంది అవినీతి అక్రమ కార్యకలాపాలపై విజిలెన్స్ శాఖ పూర్తి స్థాయిలో దృష్టి నిలపడంతో అధికార యంత్రాంగం బెంబేలెత్తుతోంది. అయితే ప్రజారోగ్య సిబ్బంది అవినీతి కారణంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకు గండి పడిందనది మాత్రం అక్షర సత్యం. ప్రజారోగ్య సిబ్బంది గత ఆరేండ్ల కాలంలో స్వాహా చేసిన లక్షల రూపాయల ఫీజు మొత్తాలను వెనక్కు కట్టించేలా చర్యలు కమిషనర్ రామలింగేశ్వర్ తీసుకుంటారా లేక ఎప్పటిలాగే వాటిని తూతూ మంత్రంగా విచారించే అటకెక్కిస్తారా అన్నది వేచి చూడాలి. అయితే సాక్షాత్తు విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ దృష్టి సారించడంతో తీగలాగితే డొంక కదిలినట్టు ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్ల అవినీతి  భాగోతం వివరాలు బహిర్గతమైతే కార్పొరేషన్ ఖజానా కు గండిపడిన కోట్ల రూపాయల సొమ్ము రికవరీ చేసేందుకు వీలు పడుతుందని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

➡️