స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు కార్మిక సంఘాల నిరసన దీక్ష

Oct 2,2024 21:48

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  విశాఖ ఉక్కు పరిశ్రమ ను ప్రైవేటీకరణ కాకుండా రక్షించాలని, సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్‌ వద్ద బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేష్‌, ఎఐఎఫ్‌టియు జిల్లా నాయకులు బెహరా శంకర్‌ రావు, ఐఎఫ్‌టియు నాయకులు కె.అప్పలసూరి మాట్లాడారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను 32 మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలతో, 67 మంది ఎంపీల రాజీనామాలతో, 30 గ్రామాల రైతుల 32వేల ఎకరాల భూముల త్యాగంతో సాధించుకున్నామని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో తయారయ్యే నాణ్యమైన ఉక్కును ప్రెవేటు ఉక్కు సంస్థలు ప్రజలకు ఎందుకు అందించలేకపోతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరావేశంతో జగన్‌ ప్రభుత్బంపై విరుచుకుపడిన పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు ఇప్పుడు ఉక్కు పరిశ్రమలోని 4వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యోగులను ఇతర రాష్ట్రాలకు బలవంతపు ట్రాన్స్‌ ఫర్స్‌ చేస్తుంటే ఉద్దేశపూర్వకంగా మౌనం ఎందుకు వహిస్తున్నారో ఆంధ్రా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బిజెపి విధానాలను వంటబట్టించుకుని పాలిసున్న కూటమి ప్రభుత్వం ఆంధ్రా ప్రజలను మత ప్రాతిపదికన విడదీసేందుకే కల్తీ లడ్డు వ్యవహరాన్ని తెరమీదకు తీసుకువచ్చారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలుచేయలేక తిరుపతి వెంటేశ్వరస్వామిని అడ్డం పెట్టుకుని ప్రజల నెత్తిపై భస్మాసుర హస్తం పెట్టాలనుకుంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చూస్తూ ఉరుకోరని, ఉద్యమాలతో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టివి రమణ, జిల్లా కార్యదర్శులు బి.సూర్యనారాయణ, ఎ.గౌరి నాయుడు, నగర కార్యదర్శి బి.రమణ, ఎఐఎఫ్‌టియు నాయకులు అప్పలరాజు, కె.గౌతమి, జి.సత్యారావు, కె.రాకేష్‌, సిఐటియు నాయకులు హరిబాబు, రాములు, శ్రీను, సూరిబాబు, సాయి, చిన్నారి తదితరులు పాల్గొన్నారు

➡️