ప్రజాశక్తి – ఆదోని : బడి వేళల్లో కాకుండా వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారని ఎస్ టి యు జిల్లా కార్యదర్శి గోపాల్ పేర్కొన్నారు. ఆదోని, కౌతాళం మండల నాయకుల సమావేశం అదోనిలో ఎస్టియు భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు (SLDP)పాఠశాల నాయకత్వం అభివృధ్ధి కార్యక్రమం (FLN)ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ పేరుతో రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు నిర్వహిస్తుండటం ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారాయని విమర్శించారు. ఇటీవల కాలంలో కృష్ణ జిల్లా అగిరేపల్లిలో జరిగిన శిక్షణ తరగతులలో ఒక ఉపాధ్యాయుడు మరణించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా గజపతినగరంలో శ్రీనివాసరావు అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల మృతితోనైనా ప్రభుత్వం మేల్కొని ఎటువంటి శిక్షణ తరగతులైనా వేసవకాలం సెలవుల్లోనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఎం సి సుంకన్న మాట్లాడుతూ శిక్షణా తరగతులను డివిజన్ కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో గాని నాన్ రెసిడెన్షియల్ విధానం లో వేసవి కాలంలోనే జరపాలని అదేవిధంగా, మృతి చెందిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం రూ 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.