మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణ

Aug 9,2024 00:04 #Polam badi
Polam badi

ప్రజాశక్తి- యంత్రాంగం తగరపువలస : మేలైన యాజమాన్య పద్ధతులు (గుడ్‌ అగ్రికల్చరల్‌ ప్రాక్టీసెస్‌)పై భీమిలి మండలం, తాటితూరులో గ్రామ రైతులకు గురువారం మండల వ్యవసాయ శాఖ అధికారి బి.శివకోమలి శిక్షణ ఇచ్చారు. సంబంధిత యాజమాన్య పద్ధతులు అనుసరిస్తూ పండించిన పంటను ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పిఒ) ద్వారా అమ్ముకునే విధానంపై ”పొలంబడి” ద్వారా ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కుగాను తాటితూరు గ్రామాన్ని ఎంపిక చేసినట్లు ఎఒ శివకోమలి తెలిపారు. 14 వారాల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇప్పటికే విత్తన శుద్ధి జరిగిందని, పొలాల్లో మట్టి పరీక్షకు నమూనాలు సేకరించి విశాఖ ప్రయోగశాలకు పంపించామని తెలిపారు. గ్రామంలో దమ్ములు, ఉడుపులు జరుగుతున్నందున రైతులు తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యలను ఆమె రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌పిఒ సిబ్బంది రాజు, రైతు సేవా కేంద్రం సిబ్బంది వి.శ్రీను, బి.శ్రీను, పివి.రమణ, గోవింద, చిన్న, శివ తదితరులు పాల్గొన్నారు.బోనీలో పొలంబడి ఆనందపురం : ఆనందపురం మండలం బోని గ్రామంలో ఉత్తమ పంటల యాజమాన్య పద్ధతులపై పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి కె.అప్పలస్వామి, భీమిలి సహాయ వ్యవసాయ సంచాలకులు బి.విజరుప్రసాద్‌, మండల వ్యవసాయ అధికారి సిహెచ్‌.సంధ్య రత్న ప్రభ రైతులతో కలిసి వరి పొలాలను పరిశీలించారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులు ద్వారా పండించే వరి పంటకు ఉన్న మార్కెటింగ్‌ సదుపాయాలపై రైతులతో చర్చించారు. రెండో విడతలో ఎకరానికి 20 కిలోల యూరియా వేయాలని సూచించారు. ఉడుపులు జరిగిన 15 నుంచి 20 రోజులకు కలుపు గమనిస్తే నామినీ గోల్డ్‌ 100 ఎంఎల్‌, ఆల్మిక్స్‌ 8ఎంఎల్‌, లేదా కౌన్సిల్‌ యాక్టివ్‌ 90 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక విఎఎ దిలీప్‌, రైతులు పాల్గొన్నారు.

➡️