ప్రజాశక్తి – కడప ప్రతినిధి కడప, అన్నమయ్య జిల్లాల ఎస్‌పిలు బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా ఎస్‌పిగా హర్షవర్దన్‌రాజు, అన్నమయ్య జిల్లా ఎస్‌పిగా విద్యాసాగర్ నాయుడులను నియమించింది. ప్రస్తుతం కడపలో పనిచేస్తున్న ఎస్‌పి సిద్ధార్థ్ కౌశల్‌ను జనరల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్‌కు రిపోర్టు చేయాలని ఉత్త ర్వుల్లో పేర్కొంది. ఈయన 2023 నవంబర్ నుంచి సుమారు 11 నెలలుగా ఎస్‌పిగా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలను సైతం ప్రశాంతంగా నిర్వహించడంలో సఫలీకృతులు కావడం తెలిసిందే. ఈయన స్థానంలో తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న హర్షవర్ధన్‌రాజును నియమించింది. ఈయన గతంలో అన్నమయ్య జిల్లా ఎస్‌పిగానూ విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లాయైన అన్నమయ్య జిల్లాలో విధులు నిర్వహించిన అనుభవం కలిగి ఉన్న నేపథ్యంలో జిల్లా బౌగోళిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లా ఎస్‌పి బి.కృష్ణారావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈయన స్థానంలో కృష్ణా జిల్లా గ్రౌహౌండ్స్‌లో ఎస్‌పిగా విధులు నిర్వహిస్తున్న విద్యాసాగర్‌నాయుడును నియ మించింది. ఈయన కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగంలో ఉత్కంఠ నెలకొంది. సుమారు రెండేళ్ల కిందటి నుంచి అన్నమయ్య జిల్లా ఎస్‌పిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణారావును అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బదిలీ చేసింది.
