పారదర్శకంగా ఇసుక సరఫరా : కలెక్టర్‌

ప్రజాశక్తి – కడప రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ విధానం జిల్లాలో చట్టబద్ధంగా, సజావుగా, సులభతరంగా సాగేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జెసి అదితి సింగ్‌తో కలిసి కలెక్టర్‌ ఇసుక రవాణా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 22న ఇసుక రవాణా కాంట్రాక్టర్లు, జిల్లా రవాణా శాఖ అధికారులు, మైనింగ్‌ అధికారులతో కలిసి ఇసుక స్టాక్‌ పాయింట్‌ నుంచి వినియోగదారుని ఇంటి వరకు ఇసుకను సరఫరా చేసేందుకు రవాణా చార్జీలను నిర్ణయించామని పేర్కొన్నారు. టన్ను ఇసుకను స్టాక్‌ పాయింట్‌ నుండి వినియోగదారుల ఇంటి వరకు చేర్చేందుకు కిలోమీటరుకు రూ.9 ల చొప్పున రవాణా ఛార్జీలు తీసుకుంటారని తెలిపారు. ఇసుక పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక నిర్వహణ ఛార్జీలు మాత్రమే తీసుకుంటోందని, ప్రజలపై ఎలాంటి పన్ను భారం మోపడం లేదని స్పష్టం చేశారు.జిల్లా యంత్రాంగం నిర్ణయించిన ఇసుక రవాణా చార్జీలను అతిక్రమించి అదనపు ఛార్జీలను వసూలు చేస్తే.. టోల్‌ ఫ్రీ నెం : 08562 246344 (జిల్లా కలెక్టరేట్‌ లోనికంట్రోల్‌ రూమ్‌) కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఇసుక అందుబాటులో ఉన్న ఎర్రబల్లి (విఎన్‌ పల్లిమండలం) కె.వెంకటాపురం (కొండాపురం మండలం), పి అనంతపురం (కొండాపురం మండలం), జ్యోతి (సిద్దవటం మండలం), పగడాలపల్లి (పెండ్లిమర్రి మండలం) మొదలైన 5 స్టాక్‌ పాయింట్ల నుండి ఇసుక సరఫరా జరుగుతోందన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేసినా, ఇసుకను బ్లాక్‌ మార్కెట్‌ చేసినా ఎవరిని ఉపేక్షించేది లేదని, చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ప్రతి మండల తహశీల్దార్లు, ఎంపిడిఒలు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోతో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఇసుక రవాణాలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా, ఇసుక డిపోల వద్ద ట్రాన్స్‌పోర్టు వాహనాల క్యూ అధికంగా లేకుండా ప్రజలకు పారదర్శకంగా అందిస్తు న్నామన్నారు. సమావేశంలో శాండ్‌ రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ విమలమ్మ, డిటిసి మీరా ప్రసాద్‌, శాండ్‌ స్టాక్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ సురేష్‌ కుమార్‌, డిఆర్‌డిఎ పీడీ ఆనంద్‌ నాయక్‌, ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️