ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్ : గిద్దలూరు ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలలో విధుల్లో ఉన్న మెడికల్ నర్సింగ్ సూపరింటెండెంట్ అనారోగ్యానికి గురికాగా తమ వైద్యశాలలో సరయిన వసతులు లేనికారణంగా ప్రయివేటు వైద్యశాలలో చికిత్స చేయించుకోవాల్సిన దురవస్థ ఏర్పడింది. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గిద్దలూరు ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మి రోజువారి తన విధుల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆసుపత్రికి విధుల్లోకి వచ్చారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆమె లోబీపీకి గురై స్పృహతప్పి పడిపోయారు. గమనించిన తోటి సిబ్బంది, డాక్టర్లు ఆమెకు వైద్యం చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆస్పత్రిలో తగిన పరికరాలు, సిటీ స్కాన్ అందుబాటులో లేవు. దాంతో చేసేదేమీ లేక 108 వాహనం ద్వారా వెంటనే విజయలక్ష్మిని పట్టణంలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమెకు వైద్య చికిత్సలు అందడంతో కోలుకున్నారు. అక్కడ వైద్యం జరిగిన కొన్ని గంటల తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో పెను ప్రమాదం తప్పిందని తోటిసిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నర్సుకే అక్కడ వైద్యం అందక ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించి అక్కడ వైద్యం పొందాల్సి రావడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పేరుకు వంద పడకల వైద్యశాల కాగా సరైన సౌకర్యాలు, వైద్యపరీక్ష మిషన్లు లేవు. వైద్య సిబ్బందికే సరైన చికిత్స అందకపోతే ఇక తమలాంటి వారి పరిస్థితి ఏమిటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
