గుమ్మలక్ష్మీపురం : గిరిజన బాలిక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని లోవముఠా ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుమ్మలక్ష్మీపురం మండలం జర్న గ్రామానికి చెందిన జీలకర్ర స్వాతి (16) తన ఇంటిలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వాతిపై గతంలో బొబ్బిలిలో లైంగిక దాడి జరిగింది. ఈ విషయమై పార్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే స్వాతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఎల్విన్‌పేట ఎస్‌ఐ బిడ్డిక శివప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
