మెగా డిఎస్‌సిలో గిరిజనులకు అన్యాయం

మెగా డిఎస్‌సిలో గిరిజనులకు అన్యాయం

ఆదివాసీ ప్రత్యేక డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలి

జిఒ3కు ప్రత్యామ్నాయ ఆర్డినెన్స్‌ జారీ చేయాలి

ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన ర్యాలీ, రాస్తారోకో

ప్రజాశక్తి-అరకులోయ: షెడ్యూల్‌ ఏరియాలో గిరిజనుకుల 100 శాతం రిజర్వేషన్లు వర్తించేలా ఆర్డినెన్స్‌ జారీ చేసి, ఆదివాసీ స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేసి నియామకాలు చేపట్టాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిలో సురేంద్ర డిమాండ్‌ చేశారు. గురువారం ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకులోయ మండల కేంద్రంలోరాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధానకార్యదర్శి పొద్దు బాలదేవ్‌ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్‌సిలో ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అరకులోయలో ఎన్నికల సభ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిఒ3కు చట్టబద్ధత కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా, మెగా డిఎస్‌సిలో పోస్టులను కలిపేయడంతో ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పాడేరు ఐటిడిఎ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖలో 400 పోస్టులు నోటిఫై చేశారని, వాటిల్లో కేవలం 24 పోస్టులు ఆదివాసులకు కేటాయించి, 1/70 చట్టం ప్రకారం ఆదివాసీ షెడ్యూల్‌ ప్రాతంలో శాశ్వత నివాసాలకు అనుమతి లేని గిరిజనేతరులకు 376 పోస్టులు కేటాయించడం ఆదివాసులకు తీరని అన్యాయం, ద్రోహం చేయడమేనన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గిరిజన ప్రాంతంలో 100 శాతం ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులతో భర్తీ చేసేలా జిఒ3కు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్డినేన్స్‌ తీసుకొచ్చి, ఆదివాసీ ప్రత్యేక డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నారు. లేకుంటే ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీలో గిరిజన నిరుద్యోగులతో ఆందోళనచ చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు జి బుజ్జిబాబు, మండల నాయకులు కిల్లో జగన్నాధం, కిల్లో ముకుందు, పి.నానిబాబు, కె బుజ్జిబాబు జి. మల్లేష్‌, జి సుబ్బారావు, అప్పలస్వామి పాల్గొన్నారు

హుకుంపేట:మెగా డిఎస్‌సిలో ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం నుండి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం మండల ప్రధాన కార్యదర్శి తాపుల కృష్ణారావు మాట్లాడుతూ, అల్లూరి జిల్లాలో 881 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానుండగా, పాడేరు ఐటిడిఎ పరిధిలో 24, రంపచోడవరం డివిజన్‌లో నాలుగు పోస్టులు మొత్తంగా కేవలం 30 పోస్టులు మాత్రమే గిరిజనులకు దక్కుతాయని, మిగిలిన 851 ఉద్యోగాలను గిరిజనేతరుల పరం కానున్నాయన్నారు. 1/70 చట్టం ప్రకారం ఐదవ షెడ్యూల్‌ ప్రాంతంలో గిరిజనేతరులకు శాశ్వత గృహాäలు నిర్మించడమే నేరమైనప్పుడు, ఇపుడు శాశ్వత ఉద్యోగాలు వారికి ఎలా కట్టిపెడతారని ప్రశ్నించారు. ఏజెన్సీలో వందశాతం ఉద్యోగాలను గిరిజనులతో భర్తీ చేసేలా జిఒ3కు ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చి, మన్యంలోని ఉపాధ్యాయ పోస్టులన్నీ గిరిజనులతో భర్తీ చేసేలా ప్రత్యేక డిఎస్‌సి నోటిఫికేషన్‌ జారీ చేయాలన్నారు. .ఈనెలాఖరులోగా ఆదివాసీ ప్రత్యేక డిఎస్‌సిపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే జిల్లా వ్యాప్త ఆందోళనలు చేస్తామన్నారు. ప్రత్యేక డిఎస్‌సి సాధనకు ఈనెల 26న పాడేరు కాఫీ హౌస్‌లో ఆదివాసి స్పెషల్‌ డిఎస్‌సి సాధన కమిటీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశానికి డిఎస్‌సి అభ్యర్థులు, నిరుద్యోగ గిరిజనులు, ప్రజలు హాజరై జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ మహిళాసంఘం నాయకురాలు ఎన్‌.హైమావతి, వైసిపి నేత జిసిహెచ్‌.సత్యం,ఉపాధ్యాయులు, ప్రభాకర్‌, బి.వి.రాజు, బొంజునాయుడు, రాంబాబు, రాజ్‌ కమల్‌ పాల్గొన్నారు.

పెదబయలు : షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీ స్పెషల్‌ డిఎస్‌సి నోటిపికేషన్‌ విడుదల చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకుడు జపరంగి సునీల్‌ కుమార్‌ డిమాండ్‌ చేసారు. గురువారం పెదబయలులో సంఘం జిల్లా కమిటీ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా మాజీ అధ్యక్షులు బొండా సన్నిబాబు, జిల్లా అధ్యక్షులు సాగిన ధర్మన్న పడాల్‌ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని ఉపాధ్యాయ పోస్టులన్నీ నిరుద్యోగ గిరిజన యువతకు దక్కాలంటే జిఒ3 చట్టబద్ధత కల్పస్తామని ఆదివాసులకు సిఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుచేయడంతోపాటు ప్రత్యేక ఆదివాసీ డిఎస్‌సి విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీలో ఆందోళన తప్పదని హెచ్చరించారు.కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు రాజు, బుజ్జిబాబు, ఎంఎం శ్రీను, రామారావు వెంకటరావు పాల్గొన్నారు.

ఏజెన్సీ ఉపాధ్యాయ పోస్టులు ప్రత్యేక డిఎస్‌సిలో భర్తీ చేయాలి

పాడేరు: రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్‌సిలో నోటిఫై చేసిన షెడ్యూల్డ్‌ ఏరియాలోని పోస్టులను మినహాయించి, వాటిని ఆదివాసీ ప్రత్యేక డిఎస్‌సి ద్వారా భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేగం సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.గురువారం సంఘం అల్లూరి జిల్లా గౌరవ అధ్యక్షులు కుర్తాడి రామారావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.నీలకంఠం మాసాడా శోభన్‌బాబులతో కలిసి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఐటిడిఎల పరిధిలోని ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలల్లోని అన్ని కేటగిరీల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను ప్రత్యేక డిఎస్‌సి ద్వారా భర్తీ చేసే ఆనవాయితీ ఉందని, అలాకాక జనరల్‌ డిఎస్‌సిలో ఏజెన్సీలోని పోస్టులను భర్తీ చేస్తే నిరుద్యోగ గిరిజన యువతకు తీరని నష్టం కలుగుతుందన్నారు. జిఒ3కు ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో అది అమలయ్యాకే ఐదవ షెడ్యూల్‌లోని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, అంతవరకు మెగా డిఎస్‌సి నుంచి ఆయా పోస్టులను మినహాయించి, ప్రత్యేక డిఎస్‌సి ద్వారా భర్తీకి వాయిదా వేయాలన్నారు.

➡️