చేగువేరాకు ఘన నివాళి

ప్రజాశక్తి-దర్శి : లౌకికత్వాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కెవి.పిచ్చయ్య పిలుపు నిచ్చారు. చేగువేరా వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి డివైఎఫ్‌ఐ మాజీ నాయకుడు ఉప్పు నారాయణ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెవి.పిచ్చయ్య మాట్లాడుతూ చేగువేరా ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితమైన వ్యక్తి కాదని, యావత్‌ ప్రపంచానికి కొత్త శక్తినిచ్చిన నేత అని కొనియాడారు. ప్రపంచంలో ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా చేగువేరా స్పందించినట్లు తెలిపారు. యువతకు దిశా-నిర్దేశం చేసి ఆచరించి చూపించిన మార్గదర్శి అని గుర్తు చేశారు. వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడే లాటిన్‌ అమెరికా మొత్తం పర్యటించాలని చేగువేరాకు కోరిక కలిగినట్లు తెలిపారు. స్నేహితుడు ఆల్బర్టో గ్రనడోతో కలసి తన పాత మోటారు సైకిలుపై లాటిన్‌ అమెరికా మొత్తం చుట్టి రావాలనుకున్నాడు. ఆ ప్రయాణమే తన జీవితాన్ని మార్చేస్తుందని చేగేవేరా కనీసం ఊహించలేదని తెలిపారు. ఆ ప్రయాణం ప్రారంభించాక మధ్యలో చేగువేరాకు అనేక అనుభవాలు ఎదురైనట్లు తెలిపారు. వలస సామ్రాజ్యవాదుల పాలనలో మగ్గిపోతూ కనీస అవసరాలైన తిండి, గూడు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బానిస బతుకులు, సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న కోట్లాది ప్రజల బాధలు, ఆకలిచావులను చేగువేరా కళ్లారా చూశారన్నారు. అప్పుడే లాటిన్‌ అమెరికాలోని బానిసల జీవితాలలో వెలుగులు నింపాలని నిర్ణయిం చుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు ఆర్‌.ఝాన్సీపాల్‌, నాయకులు కంట వెంకట్రావు, కళ్యాణ్‌, డివైఎఫ్‌ఐ మాజీ నాయకుడు ఉప్పు నారాయణ,.ఆదినారాయణ పాల్గొన్నారు.

➡️