ప్రజాశక్తి-గుంటూరు : స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య నగర్‌లో శనివారం గురజాడ అప్పారావు 109 వర్ధంతి కాలనీ ఐద్వా కమిటీ కార్యదర్శి షేక్.ఖాజాబీ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత కోశాధికారి సుకన్య, ఇతర నాయకులు గురజాడ అప్పారావు చిత్రపటానికిి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా నగర అధ్యక్షులు జి.రమణ మాట్లాడుతూ గురజాడ అప్పారావు గొప్ప సంఘసంస్కర్త అని, స్త్రీల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి అని, దేశమంటే మట్టికాదోరు దేశమంటే మనుషులోరు అని సమాజాన్ని మార్చడంలో కొత్త ఆలోచన రేకెత్తించాడని కొనియాడారు. బాల్య వివాహాల నిర్మూలనకు, మహిళా విద్య కోసం కృషి చేశాడన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు మహిళల పట్ల చిన్నచూపు చూస్తున్నాయని, మహిళల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్నారు. మహిళలపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయని, ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాలు నేరస్తుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కార్యక్రమంలో ఐద్వా నాయకులు నూర్జహాన్, అచ్యుత కుమారి తదితరులు పాల్గొన్నారు.
స్థానిక జెకెసి కాలేజిలో శనివారం గురజాడ అప్పారావు 109వ వర్థంతి నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.గోపీచంద్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ తెలుగు-ఆంగ్ల సాహిత్యాల తారతమ్యత, ఆంగ్ల కవుల సాహితీ గమ్యాన్ని మన తెలుగు కవులు కొన్ని ప్రక్రియలను తీసుకొని తెలుగు సాహిత్యాన్ని ముందుకు నడిపించారన్నారు. ఆధునికాంధ్ర కవిత్వానికి మూలపురుషుడిగా తెలుగు ఉన్నంతకాలం ఉంటారని కొనియాడారు. కళాశాల పీజీ కోర్సుల డైరెక్టర్ యస్.ఆర్.కె.ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు వ్యవహారిక భాషకు గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చిన ఘనుడు గురజాడ అన్నారు. ముఖ్య అతిథి జి.ఎస్.చలం మాట్లాడుతూ గురజాడ సాహిత్యాన్ని విశ్లేషించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – పెదనందిపాడు : స్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో అప్పారావు చిత్రపటానికి సిఐటియు నాయకులు మర్రి లక్ష్మి, రైతు సంఘం మండల అధ్యక్షులు ముద్దన వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కన్వీనర్ దొప్పలపూడి రమేష్‌బాబు మాట్లాడారు. కె.లక్ష్మి, రాజు, అఖిల, స్వరూపారాణి, షమీరా, హరిత, సురేఖ, వెంకటేశ్వర్లు, లక్ష్మి పాల్గొన్నారు.