ప్రజాశక్తి-చింతపల్లి :మండలంలోని పెదబరడ పంచాయతీ, చింతలూరు గ్రామంలో చింతపల్లి, జికె.వీధి మండలాల సిపిఎం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇటీవల మరణించిన, సిపిఎం అఖిల భారత కార్యదర్శి, సీతారాం ఏచూరి జ్ఞాపకాలతో ప్రజాశక్తి ముద్రించిన ప్రత్యేక సంచికను కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ అల్లూరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, బోనంగి చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ ఏచూరి మరణం దేశంతోపాటు ప్రపంచంలోని లౌకిక ప్రజాతంత్ర శక్తులకు, ప్రపంచ కమ్యూనిస్టు శక్తులకు తీరని లోటన్నారు, లౌకిక భారత దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ ఏ మాత్రం మంచిది కావని, విభిన్న భాషలు, కులాలు, రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా ఒకే దేశం, ఒకే ఎన్నిక సాధ్యం కాదని సిపిఎం అఖిలభారత కమిటీ ఎప్పుడో తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. మళ్లీ జమిలి ఎన్నికల ప్రస్తావన తెరపైకి తేవడంతోపాటు దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం సరికాదన్నారు. దేశంలో ఉన్న నిరుద్యోగం, ఇతర సమస్యలను పక్కదోవ పట్టించే కుట్రలో భాగమే ఇదని విమర్శించారు. ఒకసారి ఎన్నుకున్న ప్రభుత్వం అనివార్య కారణాల వల్ల కూలిపోతే, మళ్లీ ఎన్నికలు వచ్చేంతవరకు రాష్ట్రపతి పాలన పెడతారా, లేకుంటే మళ్లీ దేశ మొత్తం ఎన్నికలు వెళ్లేలా రద్దు చేస్తారా స్పష్టం చేయాలన్నారు, ఒక ఎంపీ, లేదా ఎమ్మెల్యే మరణిస్తే అక్కడ ఎన్నిక పరిస్థితి ఏంటని ప్రశ్నించారు, అంతేకాకుండా రాష్ట్రాల హక్కులను కేంద్ర ఎన్నికల సంఘం అదుపులోకి తద్వారా కేంద్రం చేతుల్లోకి తీసుకుని, రాష్ట్రాల హక్కులను హరిస్తారా? అని ప్రశ్నించారు. ఇది ఫెడరల్ వ్యవస్థకు నష్టమని, దీనిపై రాష్ట్రంలో ఉన్న టిడిపి జనసేన వైఖరి ఏంటో ప్రజలకు తెలియజేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో సిపిఎం బలపడితేనే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, ఆ దిశగా శాఖ, మండల, జిల్లా మహాసభలు షెడ్యూల్‌ను ప్రకటించారు. కార్యక్రమంలో, సిపిఎం చింతపల్లి మండల కార్యదర్శి, పాంగి ధనుంజరు, సాగిన చిరంజీవి, కిలో సింహాచలం, జీకే వీధి మండలం, అమ్మవారి దారకొండ సూపర్ సర్పంచ్, ముర్ల రామారావు, ఉప సర్పంచ్, ముర్ల చంటిబాబు పాల్గొన్నారు.
ఏచూరి సంచికను ఆవిష్కరిస్తున్న చిన్నయ్యపడాల్