‘మాగుంట’కు నివాళులు

Nov 26,2024 21:52
ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ కావ్యక్రిష్ణారెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ కావ్యక్రిష్ణారెడ్డి

‘మాగుంట’కు నివాళులు

ప్రజాశక్తి-కావలి : కావలి ప్రజల దాహార్తిని తీర్చిన వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి అని, కావలి ఎంఎల్‌ఎ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. దివంగత ఎంపి మాగుంట సుబ్బరామరెడ్డి 77వ జయంతి కార్యక్రమం ఆర్‌టిసి బస్టాండ్‌ వద్ద ఉన్న ఆయన విగ్రహం వద్ద టిడిపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ పాల్గొని సుబ్బరామరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి, ఒంగోలు పార్లమెంట్‌ సభ్యునిగా సుబ్బారామన్న గెలుపొందారన్నారు. దేశ ప్రధానులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు నుండి ప్రశంసలు అందుకున్న వ్యక్తి మాగుంట అని తెలిపారు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో నక్సలైట్ల చేతిలో ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వెంగళరావు నగర్‌ నుండి పేదవాళ్ళు నివసించే అనేక కాలనీల్లో టాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని అందించే వారని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నా, లేకున్నా నిరంతరం కావలి ప్రజల దాహార్తిని తీర్చిన కుటుంబం వారిదన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మాగుంట లేని లోటు ఇప్పటికీ కనిపిస్తుందన్నారు. ఆయన మృతితో నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కోలుకోలేని దెబ్బ తగిలిందని, ఆ లోటుతో అభివృద్ధి ఫలాలు అందుకోవడంలో కొంత వెనకడుగు కనిపిస్తుందన్నారు. టిడిపి శ్రేణులు నిరంతరంమాగుంట సుబ్బరామరెడ్డి, వారి సతీమణి పార్వతమ్మ ఆశయాలను కొనసాగిస్తారన్నారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తికొండ కిషోర్‌ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, గుంటుపల్లి రాజ్‌ కుమార్‌ చౌదరి, పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం, నాయకులు, కార్యకర్తలు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు.

➡️