వయోజనులకు క్షయ నివారణ టీకా

May 16,2024 20:30

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : జిల్లా వ్యాప్తంగా గురువారం వయోజనుల క్షయ నివారణ టీకా కార్యక్రమం ప్రారంభమైంది. రాకోడు పిహెచ్‌సి పరిధిలో చెల్లూరు హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్‌ ను డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ భాస్కరరావు సందర్శించి జరుగుతున్న టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి ముఖ్యమైన మార్గదర్శకాలు, వ్యాక్సిన్‌ వెయ్యవలసిన వారికి ఆరు ప్రమాణాల గురించి తెలిపారు. గత ఐదేళ్లలో టిబి వచ్చి తగ్గిపోయిన వారు, 18ఏళ్లు నిండిన వారు, పొగ తాగేవారు, సుగర్‌ వ్యాధి ఉన్న వారు, టిబి రోగులతో సన్నిహిత సంబంధాలు తప్పనిసరిగా టీకా వేసుకోవాలని తెలిపారు. వ్యాక్సిన్‌ వేసిన తర్వాత వ్యాక్సిన్‌ వేసిన చోట బొబ్బ గాని మచ్చ గాని ఏర్పడుతుందని, దీనివల్ల భయపడాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇవ్వాలని సిబ్బందికి తెలిపారు.

జాతీయ డెంగీ దినాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీని డిఎంహెచ్‌ఒ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ డెంగ్యూ నిర్ధారణ పరీక్ష కేవలం విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, రాజాం ప్రాంతీయ ఆసుపత్రిలో మాత్రమే ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలంతా వారానికి ఒకసారి డ్రైడే పాటించి దోమల వ్యాప్తిని అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో డిఎంఒ వై.మణి, ఎపిడిమోలాజిస్ట్‌ జి. వెంకటేష్‌, డిసిఎం బి. మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

డెంగీపై అవగాహన ర్యాలీలు

వేపాడ : జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా వేపాడ, బొద్దాం పిహెచ్‌సి వైద్యుల ఆధ్వర్యాన గురువారం అవగాహన ర్యాలీలు చేపట్టారు. వేపాడ, బొద్దాం, కెజిపూడి, పాతవూరు, చిట్టివానిపాలెం, శొంటివానిపాలెం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా డెంగీ వ్యాధి బారిన పడకుండా వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని జోనల్‌ మలేరియా అధికారి డాక్టర్‌ ఎం.శాంతిప్రభ, జిల్లా మలేరియా అధికారి వై.మణి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమాల్లో వైద్యాధికారులు ఎ.ధరణి, రమాదేవి, శివాని, సిహెచ్‌ఒ ఆంజనేయులు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎన్‌.వెంకటరావు, సూపర్‌వైజర్‌ మూర్తి, వైద్య సిబ్బంది దాలినాయుడు, శేఖర్‌బాబు, వెంకటరావు, రాజశేఖర్‌, సత్య, తదితరులు పాల్గొన్నారు.

శృంగవరపుకోట : కొట్టాం పిహెచ్‌సి ఆధ్వర్యంలో బొడ్డవర, కొట్టం, శృంగవరపుకోటలో డెంగీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డెంగీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు జె.హారిక, బి.శిరీష, ఎన్‌.మానస వివరించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది వి.సన్యాసప్పడు, వరలక్ష్మి, శంకర్రావు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

వయోజనులకు క్షయ నివారణ టీకా

పూసపాటిరేగ : సమాజం బాగస్వామ్యంతో డెంగీ వ్యాధిని నివారిద్దామని పూసపాటిరేగ పిహెచ్‌సి వైద్యులు రాజేష్‌వర్మ, ప్రమీలాదేవి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రపంచ డెంగీ దినోత్సవం సందర్బంగా అవగాహనా ర్యాలీని వైద్య సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఇంటిలోపల, ఇంటూ చుట్టూ పక్కల నీటి నిల్వలను తొలగించాలన్నారు. ప్రజా అవగాహనతో డెంగీ వ్యాధిని నివారించవచ్చన్నారు. ర్యాలీలో ఆరోగ్య విద్యాభోదకులు మహేశ్వరి, సూపర్‌వైజర్‌ నాగమ్మ, ఉమాపతి, ఆరోగ్య సహాయకులు ఆర్‌వి రమణ, బంగారుబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️