లీకుల ప్రభుత్వంగా మారిన మోడీ ప్రభుత్వం : పిసిసి మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డి

ప్రజాశక్తి – వేంపల్లె (కడప) : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారిందని పిసిసి మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లెలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నీట్‌ పరీక్షలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … మోడి పాలనలో ఒక పరీక్ష కూడ నిర్వహించలేదు అన్నారు. నీట్‌ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరారు. పోటి పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని అసమర్థత, దద్దమ్మ ప్రభుత్వంగా మారిందని చెప్పారు. గత 10 సంవత్సరాల మోడి పాలనలో దాదాపు 72 సార్లు పరీక్ష పేపర్లు లీక్‌ అయినట్లు చెప్పారు. మే 5వ తేదిన దేశ వ్యాప్తంగా వైద్య కళాశాల్లో ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి నీట్‌ పరీక్ష జరిగిందని చెప్పారు. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావడం జరిగిందని చెప్పారు. కానీ ముందు రోజే బీహార్‌, గుజరాత్‌, హర్యానా రాష్ట్రాల్లో అనేక చోట్ల పరీక్ష పేపర్‌ లీక్‌ అయ్యిందని చెప్పారు. డబ్బులు భారీగా చేతులు మారినట్లు చెప్పారు. ఒక్కోక అభ్యర్థి నుండి రూ 30 లక్షలు వసూలు చేసినట్లు చెప్పారు. బీహార్‌ లో 14 మందిని అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. డబ్బులు ఇచ్చినట్లు పేపర్‌ లీకు అయినట్లు అభ్యర్థులు ఒప్పుకున్నట్లు చెప్పారు. నీట్‌ పరీక్షల్లో ఇంత అవకతవకలు జరిగినప్పుటికి ప్రధాని మోడి మాట్లాడడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడి మౌనం వీడి నీట్‌ పై మాట్లాడాలని తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. నీట్‌ పరీక్షలపై విచారణ జరిపి ద్రోహులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. అంతకు ముందు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమ్‌ అద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్‌ రహంతుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు దాదాపీర్‌, పీరుబాషా, కాంగ్రెస్‌ నాయకులు రామకృష్ణ, అమర్‌, బాలం సుబ్బరాయుడు, వేమయ్య, వేమా రాజా వినరు, రవి, మహబూబ్‌ బాషా (మాస్‌), మదార్‌, బద్రి, సుబ్రమణ్యం పాల్గోన్నారు.

➡️