ప్రజాశక్తి-విజయనగరం కోట : సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికులకు తిరుగు ప్రయాణంలో కూడా తిప్పలు తప్పడం లేదు. సంక్రాంతి, కనుమ పండుగ ముగించుకుని గురువారం విధులు నిర్వహించుకునేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వలస కూలీలు, ఉద్యోగస్తులు ఆర్‌టిసి బస్సులు కోసం పడరాని పాట్లు పడ్డారు. సకాలంలో బస్సులు లేకపోవడం.. వచ్చిన బస్సులు కూడా కిక్కిరిసిపోవడంతో నానా ఇబ్బందులుపడ్డారు. ఎక్కువ బస్సులను విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరలించడంతో ఈ సమస్యలు తలెత్తాయి. శ్రీకాకుళం,పాత గాజువాక, అనకాపల్లి, సాలూరు రూట్లలో ప్రయాణికులు ఎక్కువగా ఉండడం, అందుకు తగ్గ బస్సులను కేటాయించకపోవడంతో ప్రయాణికులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
