ఎన్టీఆర్ : ఐర్లాండ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారు ఏలూరు జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ (24), పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్ (25)లుగా గుర్తించారు. చిట్టూరి భార్గవ్, చెరుకూరి సురేష్‌లు మరో ఇద్దరితో కలిసి కారులో ట్రిప్‌కు వెళ్తుండగా రాతో అనే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భారీగా మంచు కురవడంతో కారు చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో భార్గవ్, సురేష్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించారు. భారీగా మంచు కురవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఐర్లాండ్ నుంచి భార్గవ్ భౌతికకాయాన్ని తెప్పించాలని కుటుంబీకులు కోరగా, నెట్టెం రఘురాం వెంటనే స్పందించి మంత్రి నారా లోకేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ మేరకు వెంటనే స్పందించి ఐర్లాండ్‌లో భారత రాయబారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఐర్లాండ్‌లో పూర్తి చేయాల్సిన లాంఛనాలు త్వరగా పూర్తిచేసి భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇద్దరు విద్యార్థుల మరణంతో ఏపీలోని తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగారు.
ఐర్లాండ్‌లో విషాదం : ఇద్దరు ఏపీ విద్యార్థులు మృతి – మరో ఇద్దరికి తీవ్రగాయాలు
