ప్రజాశక్తి-బొండపల్లి : గొట్లాంలో బంగారు దుకాణంలో సెప్టెంబర్ 14న రాత్రి జరిగిన చోరీ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి అరకిలో వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం బొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో డిఎస్‌పి శ్రీనివాసరావు విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసి, వివరాలు వెల్లడించారు. డిఎస్‌పి కథనం ప్రకారం…గొట్లాంలోని శ్రీ సిద్ధివినాయక జువెలరీ షాప్‌లో సెప్టెంబర్ 14న రాత్రి పది కేజీల వెండి ఆభరణాలు, సుమారు తులమున్నర బంగారం పోయిందని షాపు యజమాని తాళ్లపూడి సత్తిబాబు బొండపల్లి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఎస్‌ఐ యు.మహేష్, సిసిఎస్ ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యాన క్లూస్ టీమ్ దొంగతనానికి పాల్పడిన వారి వేలిముద్రలను సేకరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నెలివాడ గ్రామ సముదాయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ కేసులో దొరికిన వేలిముద్రలు వారితో సరిపోయాయి. వారు మధ్యప్రదేశ్‌కు చెందిన అజరు పార్ది, సుల్తాన్ మొగియా పార్దిగా గుర్తించారు. వీరి వద్ద నుండి సుమారు అరకిలో వెండి వస్తువులు, రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వివేక పార్ది, చరం పార్ది, పురం పార్ది, సచిన్ పార్దితోపాటు దొంగతనానికి ప్రోత్సహించిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉందని డిఎస్‌పి తెలిపారు. సమావేశంలో సిఐ జిఎవి రమణ, ఎస్‌ఐలు యు.మహేష్, సత్యనారాయణ, ఎఎస్‌ఐ గోపీనాథం తదితరులు పాల్గొన్నారు.
