- ముగ్గురు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి-శంఖవరం (కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి 16వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. డ్రైవర్‌తో సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయానికి కారులో బయలుదేరారు. కత్తిపూడి జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని అతివేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చావాకుల శ్యామ్‌ప్రసాద్ (49), కరింశెట్టి శివన్నారాయణ (38), ఆయన భార్య దివ్య తేజస్వి (30) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కరింశెట్టి సత్యనారాయణ, చావాకుల అనంతలక్ష్మి లక్ష్మీప్రసన్న, లక్ష్మీకాంతంతోపాటు, కారు డ్రైవర్ నిమ్మగడ్డ రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాకినాడ జిజిహెచ్‌కు తరలించారు. డ్రైవర్ అతివేగంతోపాటు, నిలిచిన లారీ నిషేధిత స్థలంలో ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.