ప్రజాశక్తి-దత్తిరాజేరు : మండలంలోని కోరపు కొత్తవలస సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడెందొరవలసకు చెందిన ఇద్దరు మృతి చెందారు. ఎస్.బూర్జివలస స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన కట్టబోను లక్ష్మణరావు (23), ఆవాల రాము (55) ద్విచక్ర వాహనంపై రామభద్రపురంవైపు వెళ్తుండగా, పార్వతీపురం నుండి విజయనగరం వైపు వస్తున్న లగేజ్ పార్సిల్ వ్యాన్ వీరి బైకును ఢకొీంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాము, లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకొంది. మృతదేహాలను విజయనగరం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
