Friendship Day రోజున విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ప్రజాశక్తి-రొంపిచర్ల (పల్నాడు జిల్లా) : స్నేహితుల దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్రంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నేడు రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామానికి చెందిన యువకులు స్నేహితులు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ లో వాటిల్లిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గ్రామానికి చెందిన రోహిత్‌ (26) హైదరాబాదులో ప్రైవేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శనివారం శెలవు దినం ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో అదే గ్రామానికి చెందిన బాలప్రసన్న (25) అనే మరో స్నేహితుడితో కలిసి శనివారం హైదరాబాద్‌ కు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితులు శనివారం రాత్రి హైదరాబాదులో బైక్‌ పై కేబుల్‌ బ్రిడ్జి మీదుగా వెళుతున్న క్రమంలో బైక్‌ డివైడర్‌ ని ఢీకొట్టడంతో యువకులు ఇద్దరు బ్రిడ్జిపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు వెంటనే హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రి చేరుకొని మృతులను స్వగ్రామం విప్పర్లకి తరలిస్తున్నారు. చనిపోయిన ఇద్దరూ యువకులు కావడంతో విప్పర్ల గ్రామంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.

➡️