అనారోగ్యంతో రెండు నెలల పాప మృతి

బిడ్డ మృతదేహాన్ని పట్టుకొని రోధిస్తున్న తల్లి పూర్తిమ

సీలేరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బాధితుల ఆరోపణ

ప్రజాశక్తి-సీలేరు

తీవ్ర అనారోగ్యానికి గురైన రెండు నెలల పసిపాపకు సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వైద్య సేవలు అందించకపోవడంతో మృతి చెందినట్లు బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం… జీకే వీధి మండలం దుప్పిలివాడ పంచాయతీ వలసగెడ్డ కాలనీకి చెందిన తమ్మిని సమర, పూర్తిమ దంపతులకు రెండు నెలల క్రితం పాప జన్మించింది. ఈ చిన్నారి రెండు రోజులుగా దగ్గు, ఆయాసం, జ్వరంతో బాధపడుతూ ఆదివారం ఉదయానికి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో తండ్రి లేకపోవడంతో తల్లి పూర్తిమ గ్రామంలో ఉన్న ఆశా వర్కరుకు చిన్నారి అనారోగ్య పరిస్థితి తెలియజేసింది. దీంతో ఆమె వెంటనే అంబులెన్స్‌ను రప్పించి బంధువుల సహకారంతో సీలేరు ప్రభుత్వాసుపత్రికి మధ్యాహ్నం 12 గంటలకు తీసుకొచ్చారు. ఆ సమయానికి ఆసుపత్రుల్లో వైద్యాధికారులు ఎవరూ లేరు. స్టాఫ్‌నర్సు దేవి ఓపి సీటు రాయకుండా, ఎటువంటి వైద్య సేవలు అందించకుండా, డాక్టర్లు లేరని, చింతపల్లి గాని, చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికిగాని తీసుకెళ్లి చిన్నపిల్లల డాక్టరుకు చూపించాలని సలహా ఇచ్చారు. రిఫరల్‌ మాత్రం రాయలేదు. దీంతో వారు సీలేరులోని ప్రైవేట్‌ వైద్యులను ఆశ్రయించగా చిన్నపిల్లల డాక్టర్లకు చూపించాలని వారు సూచించారు. ఏం చేయాలో తెలియక పాపను ఇంటికి తీసుకెళ్లిపోయారు. పాప పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వేరే ఊరులో బంధువుల ఇంటికి వెళ్లిన తండ్రి సమరకు విషయం తెలియజేయడంతో ఆయన వెంటనే వచ్చి రాత్రి 10 గంటల సమయంలో సీలేరు ఆసుపత్రికి పాపను మళ్లీ తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫరల్‌ రాసి, గంటన్నర తర్వాత అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. చిన్నారిని అంబులెన్స్‌లో చింతూరు తరలిస్తుండగా మార్గ మధ్యలో మంగంపాడు గ్రామం దాటేసరికి చిన్నారి మృతి చెందింది. దీంతో అదే అంబులెన్స్‌లో చిన్నారి మృతదేహాన్ని వారి స్వగ్రామానికి చేర్చారు. వైద్యాధికారిని నిలదీసిన బంధువులు, కూటమి నాయకులుబాధిత తండ్రి సుమర, వారి బంధువులు సోమవారం ఉదయం సీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వైద్యాధికారి ఖాదర్‌ మస్తాన్‌ వల్లి, స్టాఫ్‌ నర్సు దేవిని నిలదీశారు. ఈ విషయంపై టిడిపి కూటమి నాయకులు చిటికెల రాము, వి.రాము, ముంది బాలుకు ఫిర్యాదు చేయడంతో వారు కూడా ఆసుపత్రికి చేరుకొని వైద్యాధికారి, స్టాఫ్‌ నర్స్‌ను ప్రశ్నించారు. చిన్నారికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపైనా, విధులకు హాజరు కాని వైద్యులపైనా తమ నాయకులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతి : తండ్రి సమర ఈ సందర్భంగా తండ్రి సమర స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ సీలేరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యాధికారులు విధుల్లో లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన చిన్నారి పాప మృతి చెందిందని ఆరోపించారు. సీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి ఇద్దరు వైద్యాధికారులు ఉన్నా ఒక్కరు కూడా ఆదివారం విధులకు హాజరు కాలేదన్నారు. సకాలంలో వైద్య సేవలు అందించినా, లేదంటే వెంటనే రిఫరల్‌ రాసి సకాలంలో అంబులెన్స్‌ ఏర్పాటు చేసినా తమ పాప చనిపోయేది కాదని తన గోడును వెల్లబుచ్చారు.ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదు : వైద్యాధికారి ఖాదర్‌ మస్తాన్‌ వల్లిఈ సంఘటనపై సీలేరు పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ ఖాదర్‌ మస్తాన్‌ వల్లిని స్థానిక విలేకరులు వివరణ కోరగా ఆసుపత్రికి తీసు కొచ్చిన చిన్నారిని చింతపల్లి లేక చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకువెళ్లి చిన్నపిల్లల వైద్యులకు చూపించాలని తమ సిబ్బంది చెప్పారన్నారు. బాధితరాలు ఇంటికి తీసుకొని వెళ్లిపోవడంతో వెళ్లి పెద్దవాళ్ళను తీసుకొని వస్తారేమోనని వేచి చూశామని, కాని రాత్రి 11.30 గంటలకు చిన్నారిని తీసుకొచ్చారని చెప్పారు. పాపను తీసుకొచ్చిన వెంటనే అంబులెన్స్‌ ఏర్పాటు చేసి చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నం చేశామని, వైద్య సేవలు అందించడంలో సిబ్బంది ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదని ఆయన పేర్కొన్నారు.

➡️