ఈత సరదాకు మరో ఇద్దరు బలి

Jun 9,2024 00:13

మృతులు ఈశ్వరయ్య, ప్రసంగి (ఫైల్‌)
ప్రజాశక్తి పెదకూరపాడు :
వేసవి సెలవుల్లో కుటుంబాలకు ఆదరువుగా నిలుస్తూ గేదెలు కాసేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులను ఈత సరదా విగత జీవులుగా మార్చింది. పెదకూరపాడు మండలం లింగంగుంట్లలో జరిగిన ఘటనపై స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సారెకుక్క నీలాంబరం-నాగమణి దంపతుల పెద్దకుమారుడు ఈశ్వరయ్య (15) సిరిపురం జెడ్పీ పాఠశాలలో 9వ తరగతి పూర్తిచేశాడు. కుక్కమళ్ల ఏసుదాసు- కోటేశ్వరమ్మల కుమారుడు ప్రసంగి(16) పదో తరగతిలో ఒక సబ్జెక్టు ఫెయిల్‌ అయ్యి సప్లింమెంటరీ పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి ఉన్నాడు. వీరిద్దరూ శనివారం గేదెలు తోలుకుని లింగంగుంట్ల-చినమక్కెన గ్రామాల మధ్య ఉన్న దక్షిణ పొలానికి వెళ్లారు. రైల్వేట్రాక్‌ పక్కన ఉన్న వాగులో ఇటీవల వర్షానికి కురిసిన నీటి మడుగు నిండటంతో అందులో ఈత కోసమని దిగారు. అయితే ఆ నీటి గుంతలో నల్లమట్టి పేరుడు ఉండటంతో బురదలో కూరుకుపోయారు. కొద్దిసేపటికి అటుగా వచ్చిన వారు గట్టుపైన దుస్తులను గమనించిన గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో పలువురు గ్రామస్తులు పరుగున అక్కడికి వచ్చారు. దుస్తుల ఆధారంగా ప్రమాదంలో చిక్కుకున్నవారెరో నిర్థారణకు వచ్చి ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. నీటి అడుగు భాగంలో కూరుకుపోయిన విద్యార్థులను ఈతగాళ్లు వెతికి ఓడ్డుకు చేర్చారు. అయితే అప్పటికీ వారికి కొన ఊపిరి ఉండడంతో పెదకూరపాడులోని సీహెచ్సీకి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు సత్తెనపల్లికి తీసుకెళ్లాలని సూచించగా ఆ ప్రయత్నంలో ఉండగానే పిల్లలిద్దరూ చనిపోయారు. చదువుకుని చేతికందిరావాల్సిన బిడ్డలు ఇలా మృత్యువాత పడడంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. ఇటీవల పెదకూరపాడు మండలంలోని కన్నెగండ్లలో సైతం ఇద్దరు విద్యార్థులు ఇదే తరహాలో మృత్యువాత పడగా బొల్లాపల్లి మండలం చక్రాయపాలెంలోనూ ఒ విద్యార్థి రెండ్రోజుల కిందట మృతి చెందాడు.

➡️