దోపిడీ జరగకుండా పోలీసులు అడ్డుకట్ట – రెండు పిస్టళ్లు, 17 బుల్లెట్లు స్వాధీనం

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ : ఒకేసారి జీవితంలో ఏదో ఒక దొంగతనం చేసి స్థిరపడిపోవాలనే దురాలోచనకు కాకినాడ పోలీసులు అడ్డుకట్ట వేశారు. బ్యాంక్‌ లేదా ఏటీఎంలను దోచేద్దాం అనుకున్న ఒక పాత నేరస్తుడిని కాకినాడ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి విషయాలను బుధవారం కాకినాడ జిల్లా పోలీసు అధికారి జి బిందు మాధవ్‌ సర్పవరం పోలీస్‌ స్టేషన్లో కేసుకు సంబంధించి విషయాలను విలేకరులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ … విశాఖపట్నంకు చెందిన చిటికెల నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి బ్యాంక్లో ఉద్యోగం చేసేవాడని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పనిచేసేటప్పుడు ఆన్లైన్‌ బెట్టింగ్‌ ఇతర వ్యసనాలకు అలవాటుపడి సుమారు 900 గ్రాముల బంగారాన్ని వాడుకుని అధికార దుర్వినియోగం చేశాడని చెప్పారు. దాంతో అతని బ్యాంక్‌ అధికారులు సస్పెండ్‌ చేశారని తెలిపారు. ఈ క్రమంలో అతనికి ఉన్న చెడు వ్యసనాలు కారణంగా అతను గతంలో పనిచేసిన ఏలేశ్వరంలోని చైతన్య గోదావరి బ్యాంక్‌ ఎటిఎం నుండి దొంగతనంగా పాస్‌ కోడ్‌ ఉపయోగించి రెండు లక్షల 30 వేల రూపాయలు దొంగతనంతో పాటు ఒకసారి మెడలో గొలుసు దొంగలించడం, నాలుగు సార్లు రాత్రి నేరాలు చేయడం, ఒక మోటార్‌ సైకిల్‌ దొంగతనం చేసినట్లు ఎస్పీ చెప్పారు. చిటికెల నాగేశ్వరరావుపై ఐదు ప్రాంతా పోలీస్‌ స్టేషన్లో కేసులు నమోదైనట్లు చెప్పారు. ఒకేసారి జీవితంలో స్థిరపడిపోదామనే ఉద్దేశంతో యూట్యూబ్‌ ద్వారా తెలుసుకొని బీహార్లోని ముంగర్‌ ఏరియాకి వెళ్లి రెండు పిస్టళ్ళు (తుపాకులు), 17 బుల్లెట్లను కొనుగోలు చేశారన్నారు. ఈ క్రమంలో దోపిడీ చేసేందుకు ప్రయత్నం చేస్తూ విశాఖపట్నం సిటీ, రూరల్‌ ప్రాంతాలతో పాటు నర్సీపట్నం, ఆంధ్ర- తమిళనాడు బోర్డర్ల వద్ద రెక్కీలు నిర్వహించాడని చెప్పారు. ఈ క్రమంలో తమకు వచ్చిన సమాచారం మేరకు కాకినాడ జిల్లా గొల్లప్రోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అతనిని అరెస్టు చేసి నేరస్తుడి నుండి బీహార్లో కొనుగోలు చేసిన రెండు పిస్టళ్ళను,17 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ ఎస్టిపిఓ మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌, రూరల్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ డిఎస్‌ చైతన్యకృష్ణ, ఎస్సైలు మురళీమోహన్‌, రవీంద్రనాథ్‌ బాబు సిబ్బంది పాల్గొన్నారు.

➡️