మృతుడు తేజ్ కుమార్ (ఫైల్) మృతుడు వెంకటగోపి (ఫైల్)
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఈతకని కాల్వలో దిగి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటన నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం సమీపంలో బుధవారం సాయంత్రం జరిగింది. రూరల్ పోలీసుల వివరాలు ప్రకారం… ప్రకాశం జిల్లా రాపర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన తేజ్ కుమార్ (19), కురిచేడు మండలం వీరయ్యపాలెం గ్రామానికి చెందిన బొరిగొర్ల వెంకట గోపి (22), మరో ఇద్దరు యువకులతో కలిసి ఒకే ద్విచక్ర వాహనంపై పెట్లూరివారిపాలెం గ్రామ పరిధిలోని చిలకలూరిపేట మేజర్ కాల్వలో ఈతకు వెళ్లారు. ఈతకు దిగిన కాసేపటికి తేజ్ కుమార్, వెంకటగోపి కాలువలో ఇటీవల నిర్మించిన డ్రాప్ వద్ద గుంతలో చిక్కుకుని మృతి చెందారు. మృతుడు తేజ్ కుమార్ ఎఎం రెడ్డి కళాశాలలో డిప్లొమా మూడే ఏడాది చదువుతుండగా, వెంకట గోపి నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీలో సిఎస్‌సి బ్రాంచ్ 3వ ఏడాది చదువుతున్నాడు. వీరు కోటప్పకొండ రోడ్డులోని మహేశ్వరి పిజి హాస్టల్‌లో ఉంటున్నారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంకట గోపి తండ్రి పదేళ్ల కిందట గుండెపోటుతో మృతి చెందగా తల్లి లచ్చమ్మ పొలం పనులు చేసుకుంటూ కుమారుడిని చదివించుకుంటున్నారు.
